నల్గొండ జిల్లాలో గంజాయి అమ్ముతున్న 8 మంది అరెస్ట్

నల్గొండ జిల్లాలో గంజాయి అమ్ముతున్న 8 మంది అరెస్ట్

మునగాల, వెలుగు :  గంజాయి అమ్ముతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్​చేశారు. కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి విలేకరులతో సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సీతారాం పంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మేవాడు. మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంకు చెందిన కొచ్చర్ల కేరి, గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామానికి చెందిన కొచ్చర్ల ప్రేమ్ కుమార్, నేరేడుచర్ల మండలం సోమవారం గ్రామానికి చెందిన భీమిశెట్టి మహేశ్ కలిసి సీతారామ పంగి వద్దకు వెళ్లి కేజీన్నర గంజాయిని కొని తీసుకొచ్చారు.

గంజాయిని కొంత వారు తాగడానికి ఉంచుకొని మిగతాది చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఒక్కో ప్యాకెట్​రూ.500 చొప్పున అమ్మేవారు. గత నెల 28న మహేశ్ సీతారాం పంగికి ఫోన్ చేసి గంజాయి తీసుకోస్తే అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పారు. సీతారాం పంగి 2 కేజీల గంజాయిని తీసుకొని లారీలో ఎక్కి కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్దకు చేరుకున్నాడు. కొచ్చర్ల శ్రీను, ప్రేమ్ కుమార్ కోదాడకు వెళ్లి అతడిని బైక్ పై ఎక్కించుకొని మునగాల మండలం నరసింహపురం గ్రామ శివారులోని మిడ్ల్యాండ్ హోటల్ వెనక గల వెంచర్ కు వెళ్లారు.

అదే సమయంలో వారి వద్ద నుంచి గంజాయి కొనడానికి మహేశ్, యశ్వంత్, శబరీనాథ్, మధుసాయి, నితీష్ తోపాటు రాకేశ్ వచ్చారు. నమ్మదగిన సమాచారం మేరకు మునగాల పోలీసులు వెంచర్ వద్దకు వెళ్లి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొచ్చర్ల కేరి పారిపోయాడు. ఈ మేరకు అరెస్​చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్సీ తెలిపారు. సమావేశంలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.