- పాల్గొనాలని ప్రజలకు కంచి పీఠాధిపతి పిలుపు
- గంగానది దేశంలోనే పవిత్ర స్థలమని, పూజనీయమని వెల్లడి
ప్రయాగ్‌రాజ్ : అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక, పవిత్ర స్నానోత్సవం మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ఎనిమిదో రోజు సోమవారం నాటికి 8 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకే 44 లక్షల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు.
దాదాపు పదిలక్షల మంది కల్పవాసీలు తమ దీక్ష, పుణ్యస్నానాలు ముగించుకొని శిబిరాల నుంచి వెనుదిరిగారు. గురువులు, సాధువుల వద్ద దీక్షలు తీసుకొని నిష్ఠతో ఉండే సామాన్య భక్తులను కల్పవాసీలుగా పేర్కొంటారు. మరోవైపు మహాకుంభమేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, పుణ్యస్నానాలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు.
గంగానది దేశంలోనే ఎంతో పవిత్ర స్థలమని చెప్పారు. ఋషులు, సాధువులు మాత్రమే కాదు, ఆదిశంకరాచార్యులు కూడా గంగలో పవిత్ర స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేశారని తెలిపారు. ‘‘ఆదిశంకరాచార్యులు ప్రత్యేకంగా గంగా మాతను స్తుతించారు.
మనకు గంగ కేవలం నది కాదు పూజనీయం. త్రివేణి సంగమ తీరం సనాతన జీవన వారసత్వంలోని విభిన్న విశ్వాసాలను అర్థం చేసుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది” అని అన్నారు. కాగా, ఉదయం 10 గంటల టైమ్‌లో సెక్టార్ 5 సమీపంలోని రాందాస్ ఆశ్రమంలోని కిచెన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.
కుంభమేళా ప్రత్యేకం ‘పైప్ కా పూల్’
మహాకుంభమేళాలో వాహనాలు, యాత్రికులు, సాధువులు, కార్మికుల మూవ్మెంట్ కోసం పాంటూన్ బ్రిడ్జిలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పైప్ కా పూల్‌గా పిలిచే వీటిని ప్రాచీన పర్షియన్ టెక్నాలజీ నుంచి ప్రేరణ పొంది నిర్మించారు. ఈ బ్రిడ్జిలకు ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా కడతారు. త్రివేణీ సంగమ ప్రాంతం అఖాడాలను లింక్ చేయడంలో ఇవే కీలకంగా ఉన్నాయి.
కుంభమేళా ప్రాంతంలో 30 పాంటూన్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది కార్మికులు ఏడాదిపాటు ప్రతిరోజు 12 గంటలు శ్రమించి వీటిని నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ఒక్కొక్కటి ఐదు టన్నుల బరువున్న 2,213 తేలియాడే ఇనుప పాంటూన్‌లను వీటి నిర్మాణంలో వినియోగించారు. పాంటూన్ బ్రిడ్జిలను మొదట క్రీస్తు పూర్వం 480లో పర్షియన్ రాజు జెర్క్సెస్1 గ్రీస్‌పై దండయాత్ర సమయంలో నదులు, ప్రవాహాలు దాటేందుకు నిర్మించారు.
ఆ తర్వాత 11వ శతాబ్దంలో చైనాలోని జౌ రాజవంశం వీటిని ఉపయోగించింది. 1874లో హౌరా, కోల్‌కతా మధ్య హుగ్లీ నదిపై మొదటి పాంటూన్ బ్రిడ్జి నిర్మించారు. బ్రిటిష్ ఇంజనీర్ సర్ బ్రాడ్‌ఫోర్డ్ లెస్లీ చెక్క పాంటూన్‌లను ఉపయోగించి నిర్మించారు. 1943లో తుపాను వల్ల దెబ్బతినడంతో దాన్ని తొలగించి హౌరా బ్రిడ్జిని నిర్మించారు.