పార్లమెంట్​ ఓట్ల కౌంటింగ్​కు​ 8 గంటలు

పార్లమెంట్​ ఓట్ల కౌంటింగ్​కు​ 8 గంటలు
  •     పార్లమెంట్​ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
  •     ఏడు హాల్స్​.. 130 టేబుల్స్​ 
  •     ముందుగా పోస్టల్​ బ్యాలెట్లు ..ఆ తర్వాత ఈవీఎంలు 

నిజామాబాద్​, వెలుగు : జూన్​ 4న జరిగే పార్లమెంట్​ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆఫీసర్లు ఎన్ని ఏర్పాట్లు చేశారు. డిచ్​పల్లిలోని క్రిస్టియన్​ మెడికల్​ కాలేజీ (సీఎంసీ)లో ఉదయం 6 గంటలకు కౌటింగ్​ప్రక్రియ మొదలవుతుంది. మొదట పోస్టల్​ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్​ జరుగుతుంది. కౌంటింగ్​ పూర్తి కావడానికి కనీసం 8 గంటల సమయం పడుతుందని అంచనా. 

అరగంటకో రౌండ్​

నిజామాబాద్​ పార్లమెంట్​ పరిధిలో మొత్తం 17,04,867 మంది ఓటర్లుండగా 71.92 శాతం పోటింగ్​ నమోదైంది. 12,26,133 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇందులో 7,414 పోస్టల్​ బ్యాలెట్లు ఉన్నాయి. 724 సర్వీస్​ ఓట్లు ఉండగా ఇప్పటికి 311 అందాయి. కౌంటింగ్​నాడు పొద్దున 8 గంటల దాకా అందే సర్వీస్​ ఓట్లును స్వీకరిస్తారు. ఉదయం 7 గంటలకు రిటర్నింగ్​ అధికారి, కలెక్టర్​సమక్షంలో పోస్టల్​, సర్వీస్​ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కోరౌండ్​ ఈవీఎం కౌంటింగ్​ ముగిసిన తర్వాత పారదర్శకత కోసం ర్యాండమ్​గా రెండు వీవీ ప్యాట్​లలోని స్లిప్​లను లెక్కిస్తారు.

అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఏఆర్వోలు ప్రతి రౌండ్​కు రిజల్ట్​ ప్రకటిస్తారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్​కు అరగంట టైం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కౌంటింగ్​పూర్తి కావడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. ప్రతి టేబుల్​ దగ్గర ఒక్కో అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంట్​కు పాస్​ ఇస్తారు. ప్రతి టేబుల్​వద్ద ఒక కౌంటింగ్​ సూపర్​వైజర్​, అసిస్టెంట్​ సూపర్​వైజర్​తో పాటు మైక్రో అబ్జర్వర్​ను అపాయింట్​ చేశారు. 25 శాతం రిజర్వు స్టాఫ్​ ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్​గా కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు వ్యవహరిస్తారు.

అసెంబ్లీ సెగ్మెంట్​ల వారీగా ఏడుగురు ఏఆర్​వోలు కౌంటింగ్​ బాధ్యతలు నిర్వహిస్తారు. సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్​నుంచి కౌంటింగ్​ను నేరుగా పర్యవేక్షించేందుకు వీలుగా హాళ్లకు సీసీ కెమెరా లు ఏర్పాటు చేశారు. ఎజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎవరూ లోపలికి సెల్​ఫోన్​ తీసుకెళ్లడానికి అనుమతించరు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కౌంటింగ్​​ 

నిజామాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో బోధన్​, నిజామాబాద్​అర్బన్​, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈనెల 13న పోలింగ్​ జరగగా.. ఈవీఎంలను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్​ రూమ్​లలో భద్రపరిచారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఓట్లను లెక్కించేందుకు ఏడు హాల్స్​ ఏర్పాటు చేశారు. పోలింగ్​కేంద్రాలు ఎక్కువగా ఉన్న నిజామాబాద్​ అర్బన్​, రూరల్​ సెగ్మెంట్​కు సంబంధించి 20,

మిగిలిన 5 అసెంబ్లీ సెగ్మెంట్​లకు 18 టేబుల్స్​పై ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 130 టేబుళ్లు, పోస్టల్​, సర్వీస్ ఓట్ల కోసం మరో 10 టేబుల్స్​ ఏర్పాటు చేశారు. నిజామాబాద్​ అర్బన్​, రూరల్​, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్​లో15 రౌండ్లు, బాల్కొండ, బోధన్​ 14 రౌండ్లు, ఆర్మూర్​ కౌంటింగ్ 13 రౌండ్లలో ముగుస్తుంది.