బడ్జెట్ 2025 నుంచి కీలక అంచనాలు.. క్రిప్టో కరెన్సీకి చట్టం!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న ఎనిమిదో బడ్జెట్ పై  పన్ను చెల్లింపుదారులు, టెక్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ సెక్టార్‌లు భారీ ఆశలు పెట్టుకున్నారు.బడ్జెట్ 2025-26కి సంబంధించిన పనిని ప్రారంభించే ముందు జనవరి 6న వివిధ వాటాదారులు, యూనియన్లు , ఇతర ప్రతినిధులతో ప్రీ-బడ్జెట్ సంప్రదింపులను జరిపారు నిర్మలా సీతారామన్.

 జనవరి 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెషన్‌లో మొదటి భాగం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13, 2025న ముగుస్తుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్  ప్రవేశ పెట్టనున్నారు. సెషన్‌లోని రెండవ భాగం మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4, 2025న ముగియనుంది. 

ఇప్పుడు అందరి చూపు.. ఫిబ్రవరి 1 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పైనే ఉంది. వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఆకాంక్షల నడుమ 2025 కేంద్ర బడ్జెట్ పన్నుల సరళీకరణ, పౌరుల సాధికారత, వృద్ధిని పెంచడం లక్ష్యంగా సంస్కరణలు, ప్రోత్సాహకాలు ఉంటాయని భావిస్తున్నారు. 

పన్ను సంస్కరణలు

ఐటీ రిటర్న్స్  ప్రాసెస్ ను మరింత సులభతరం చేయడం, ట్యాక్స్ రూల్స్ సరళతరం అవుతాయని భావిస్తున్నారు. అటు వ్యక్తులు, ఇటు వ్యాపార సంస్థలు రెండింటికి సంతృప్తి పరిచడం ప్రభుత్వం దృష్టి పెడుతుందని ముఖ్యంగా పేపర్ వర్క్స్ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జీఎస్టీ మరింత సరళీకృతం..

వ్యాపార సంస్థలు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న ,మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు), హేతుబద్దమైన GST స్లాబ్‌లు, వేగవంతమైన ఐటీ రిటర్స్స్ ఆశిస్తున్నాయి. మరింత సరళమైన GST వ్యవస్థ వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది.

ALSO READ | క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్ వచ్చేస్తుందా!

ఈ బడ్జెట్ లో హౌసింగ్ లోన్ వడ్డీ మినహాయింపులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. దీంతో గృహ నిర్మాణం మరింత సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. ట్యాక్స్ విషయానికి కొస్తే.. సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ , ఎక్కువ రాయితీలు అధిక మినహాయింపులు మధ్యతరగతి కుటుంబాలకు చాలా అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తాయి.

క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ..

ఈక్విటీలు,రియల్ ఎస్టేట్‌లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, మూలధన లాభాల ట్యా్క్స్ ఫ్రేమ్‌వర్క్‌ను సరళీకృతం చేయొచ్చని భావిస్తున్నారు. ఆస్తి తరగతుల్లో ఏకరీతి పన్ను రేట్లు గందరగోళాన్ని తగ్గించడం, ఎక్కువ మంది ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి అవకాశం ఉంది.

క్రిప్టోకరెన్సీ ట్యాక్స్ పై స్పష్టత

క్రిప్టో రంగం స్పష్టమైన రూల్స్, ట్యాక్స్ ల కోసం వేచి ఉంది. పెరుగుతున్న ఈ డిజిటల్ అసెట్ మార్కెట్‌కు ఈ బడ్జెట్ లో పారదర్శకత, చట్టపరమైన స్థిరత్వాన్ని తీసుకువచ్చే నిబంధనలు, న్యాయపరమైన ట్యాక్స్ విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

జీతం పొందే వ్యక్తుల కోసం పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్

పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి నెలసరి జీతాలు పొందే వ్యక్తులకు ప్రభుత్వం ఉపశమనం అందిస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం  స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచుతుందని ఆశిస్తున్నారు. 

ఉద్యోగాల కల్పనకు..

బడ్జెట్ వివిధ రంగాలలో ఉపాధిని సృష్టించే లక్ష్యంతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్కిల్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ కోసం నిధులను కేటాయించవచ్చన భావిస్తున్నారు. 

మహిళా ట్యాక్స్ పేయర్స్ ప్రోత్సాహకాలు

మహిళా నిపుణుల కోసం ప్రత్యేక పన్ను మినహాయింపులు లేదా తగ్గింపులు ప్రవేశపెట్టొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మహిళలకు ఆర్థికంగా సాధికారత కల్పించడం, శ్రామికశక్తిలో వారిని ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా మినహాయింపులు ఉండొచ్చంటున్నారు. 

ట్యాక్స్ పేయర్స్ ఆందోళనలను పరిష్కరిస్తూ దేశ ఆర్థిక వృద్ధివైపు నడిపించేలా బడ్జెట్ 2025 ఉంటుందని ఆశిస్తున్నారు. విభిన్న సంస్కరణలు, సరళీకృత, సమగ్ర ఆర్థిక భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుందని అంచనా వేస్తున్నారు.