చండీగఢ్: పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షంలో ఓ బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొని కాలువలో పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. శుక్రవారం ఉదయం భటిండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 20 మందికి పైగా ప్రయాణికులతో బస్సు తల్వాండి సాబో నుంచి భటిండాకు బయలుదేరింది. బటిండాకు సమీపంలో అదుపుతప్పి బస్సు కాలువలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని బటిండాలోని షాహిద్ బాయ్ మాన్ సింగ్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి క్రిటికల్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్లోనే ఐదుగురు మరణించగా.. ఆస్పత్రిలో ట్రీట్మెంట్పొందుతూ మరో ముగ్గురు చనిపోయారని అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మృతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని జిల్లా అధికారులు తెలిపారు.