Simhachalam: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. భారీ గోడ కూలి ఎనిమిది భక్తులు మృతి

Simhachalam: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి.. భారీ గోడ కూలి ఎనిమిది భక్తులు మృతి

విశాఖ: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో గాలి వానకు భారీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో.. శిథిలాల కింద చిక్కుకుని ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిమగ్నమై ఉన్నాయి. 300 రూపాయల టిక్కెట్‌ కౌంటర్‌ దగ్గర ఇటీవలే గోడ నిర్మించారు. ఈదురుగాలులకు భారీ టెంట్‌ ఎగిరి గోడ మీద పడింది. టెంట్‌ పడడంతో గోడ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత కుండపోత వర్షం కురిసింది. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహాచలంలో స్వామిని నిజరూపంలో దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి ఒంటిగంటకే భారీగా పోటెత్తారు.

చందనోత్సవంలో అడుగడుగునా సమన్వయ లోపం కనిపించిందని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రోటోకాల్ సేవలో అధికారులు తరిస్తూ సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత స్పందిస్తూ.. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. 

గోడ ఎవరి హయంలో కట్టారో, కాంట్రాక్టర్‌ ఎవరో అన్ని విషయాలపై విచారణ జరుపుతామని, కూలిన గోడ నాణ్యతపై సమగ్ర విచారణ జరిపిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.