
- ఆరుగురికి గాయాలు
- ఏపీలోని అనకాపల్లిలో ప్రమాదం
హైదరాబాద్, వెలుగు: ఏపీలోని అనకాపల్లి జిల్లాలో పటాకుల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం జిల్లాలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఉన్న బాణసంచా కేంద్రంలో పటాకులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి బాణసంచా కేంద్రం మొత్తం కూలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అనంతరం గాయపడిన వారిని వైజాగ్ కేజీహెచ్‌కు తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ప్రాంతానికి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా బాణసంచా కేంద్రంలో కూలి పనికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలాన్ని హోం మంత్రి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సందర్శించి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అనిత సీఎంకు ఫోన్‌లో వివరించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.