మరో 8 మెడికల్ కాలేజీలు..ఒక్కో కాలేజీలో వంద సీట్లు

వచ్చే ఏడాది అందుబాటులోకి: మంత్రి హరీశ్‌‌

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కాలేజీలో వంద సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గద్వాల, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్ (నర్సంపేట), మెదక్,  యాదాద్రి భువనగిరి(యాదాద్రి), రంగారెడ్డి (మహేశ్వరం), మల్కాజ్‌‌గిరి (కుత్బుల్లాపూర్‌‌‌‌) జిల్లాల్లో ఈ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. 

ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ దవాఖాన్లకు అనుబంధంగా కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాలేజీ బిల్డింగుల నిర్మాణ బాధ్యతలను రోడ్లు భవనాల శాఖకు, దవాఖాన్ల అప్‌‌గ్రెడేషన్‌‌, అవసరమైన ఎక్విప్‌‌మెంట్ కొనుగోలు బాధ్యతలను మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఈ 8 కాలేజీలను వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హరీశ్‌‌రావు ప్రకటించారు. 

వీటన్నింటికీ ఎన్‌‌ఎంసీ నుంచి పర్మిషన్ వస్తే, ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సొంతం చేసుకుంటుందన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలుంటే, తెలంగాణ వచ్చాక 21 కాలేజీలు ఏర్పాటు చేసినట్టు మంత్రి చెప్పారు. కొత్త కాలేజీలు అందుబాటులోకి వస్తే మొత్తం ప్రభుత్వ కాలేజీల సంఖ్య 34కు పెరుగుతుందన్నారు. మెడికల్ కాలేజీలు సాధించడంలో కృషి చేసిన ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు.

పెరిగిన సీట్లు 

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌ సీట్ల సంఖ్య గ‌‌ణ‌‌నీయంగా పెరిగింది. ఈ పదేండ్లలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్‌‌‌‌లో కలిపి 36 మెడికల్ కాలేజీలు ఏర్పడగా, వీటిల్లో 5,490 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం 56 మెడికల్ కాలేజీల్లో 8,340 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 8 కాలేజీలకు ఎన్‌‌ఎంసీ పర్మిషన్ వస్తే వచ్చే ఏడాది ఎంబీబీఎస్‌‌ సీట్ల సంఖ్య 9,140కి చేరుతుంది.