కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 8 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. వీళ్లలో నాలుగైదుసార్లు ఓడిపోయి.. విజయం సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. చొప్పదండి నుంచి పోటీ చేసిన మేడిపల్లి సత్యం 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయినా ఈ సారి విజయం సాధించారు. 2018లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొన్నం ప్రభాకర్.. ఈసారి హుస్నాబాద్ నుంచి గెలిచారు.
మానకొండూరులో 2009లో పీఆర్పీ నుంచి, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సారి కాంగ్రెస్ నుంచి విజయఢంకా మోగించారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఇప్పటికీ నాలుగుసార్లు ఓడిపోయిన ఆది శ్రీనివాస్ ఈ సారి గెలిచి ఎమ్మెల్యే కావాలన్న తన కలను నెరవేర్చుకున్నారు. రామగుండంలో గతంలో రెండుసార్లు ఓడిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ సారి గెలిచారు.
ధర్మపురి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగుసార్లు ఓడిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎట్టకేలకు గెలిచారు. కోరుట్ల ఎమ్మెల్యేగా తన తండ్రి స్థానంలో డాక్టర్ సంజయ్ పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా 2018లో పోటీ చేసి ఓడిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.