8 ప్లస్ 8..గుండుసున్నా .. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రానికి ఏం తేలేకపోయారు: కేటీఆర్

  • బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతోనే పార్లమెంట్​లో తెలంగాణ పదం వినపడలే
  • బడ్జెట్​తో కేంద్ర వైఖరిపై కాంగ్రెస్​కు తత్వం బోధపడ్డది 
  • ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టం 
  •  సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శ 

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్‌‌లో తెలంగాణ అనే పదం వినబడకపోవడానికి కారణం లోక్‌‌సభలో బీఆర్‌‌ఎస్ ఎంపీలు లేకపోవడమేనని ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ‘‘లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు. కానీ, కేంద్ర బడ్జెట్​చూశాక.. 8 ప్లస్ 8 గుండుసున్నా అని తేలింది. తెలంగాణ అన్న పదమే నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌‌ ప్రసంగంలో వినిపించలేదు. ఆనాడు ఉమ్మడి ఏపీలో ఇదే శాసనసభలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు.

 గులాబీ జెండా ఎగిరినంకనే తెలంగాణ పేరు ఇక్కడ, అక్కడ ఉండేది. ఈ రోజు అక్కడ లేకుండాపోయింది” అని అన్నారు. బుధవారం అసెంబ్లీలో ‘బడ్జెట్‌‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది’ అనే అంశంపై చర్చలో కేటీఆర్ మాట్లాడారు. ఈ చర్చను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రారంభించలేదని ఆయన ప్రశ్నించారు. ‘‘మంత్రి శ్రీధర్‌‌బాబు తన ప్రసంగంలో కొత్తగా చెప్పిందేమీ లేదు. కేంద్ర వైఖరి పై గత పదేండ్లుగా మేం చెప్పిందే ఇప్పుడు వాళ్లు చెప్పారు. ఇన్ని రోజులుగా జరిగిన అన్యాయమే ఇప్పుడూ జరుగుతున్నది. ‘కేసీఆర్‌‌ కెలికి పంచాయితీ పెట్టుకుని అవన సర భేషజాలకు పోయిండు కాబట్టే.. పదేండ్లు ఏంకాలే దు. అందుకే నేను కేంద్రంతో సఖ్యతగా ఉంటా.

 మా ప్రభుత్వానికి కేంద్రంతో ఇప్పటి నుంచి సత్సంబంధాలు ఉంటయ్‌‌. మోదీ బడేభాయ్‌‌.. నేను చోటేభాయ్‌‌’ అని సీఎం రేవంత్ అన్నారు. మరి ఇప్పుడేమైంది? మీదాకా వస్తేనే అర్థమైందా? కేంద్ర పెద్దలు ఎలా వ్యవహరిస్తరో.. ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్టు.. 20 సార్లు ఢిల్లీలో దిగినా అక్కడ ఏం జరగద న్న విషయం మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పటికైనా తత్వం బోధపడినందుకు సంతోషం. కాకపోతే మీలాగా మాకు కొన్ని అలవాట్లు లేవు. మేం ప్రయత్నం చేశాం.. చాలా పనులు సాధించాం” అని కేటీఆర్​ అన్నారు. 

మంత్రివర్గమంతా ఢిల్లీలో దీక్ష చేయాలి

రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గమంతా ఢిల్లీలో దీక్ష చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘‘ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తరచూ మమ్మల్ని దీక్ష చెయ్యిమని చెబుతున్నడు. రుణమాఫీ అంటే హరీశ్ దీక్ష చేయాలని అంటున్నడు. నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను దీక్ష చెయ్యిమంటున్నడు. అందుకే నేను సీఎం, మంత్రివర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నాను. మన ప్రభుత్వం, మంత్రుల కమిట్ మెంట్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి నాయకత్వంలో మొత్తం మంత్రివర్గం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొండి. 

మేమంతా అండగా ఉంటం. మీ చుట్టూ కూర్చుంటం.  ఎమ్మెల్యేలం, ఎంపీలందరం వస్తం. సచ్చేదాకా కూర్చొండి.. కేంద్రంతో కొట్లాడుదాం.. నిధులు సాధించుకుందాం” అని కేటీఆర్ అన్నారు. సీఎం ఓపిక కోల్పోయి రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారని, పేమెంట్ కోటాలో సీఎం పదవిని కొట్టేశారని కామెంట్ చేశారు. ‘‘అయ్యల పేరు చెప్పి పదవులు తెచ్చుకున్నారని సీఎం అంటున్నారు. ఆయన రాజీవ్‌‌ గాంధీని అంటున్నారా? రాహుల్ గాంధీని అంటున్నారో? నాకు అర్థం కావడం లేదు” అని అన్నారు. దీంతో మంత్రి శ్రీధర్‌‌బాబు జోక్యం చేసుకుని కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.