నారాయణపేట జిల్లాలో విషాదం : మట్టిపెళ్లలు మీదపడి 8 మంది కూలీలు మృతి

నారాయణపేట జిల్లాలో విషాదం : మట్టిపెళ్లలు మీదపడి 8 మంది కూలీలు మృతి

నారాయణపేట జిల్లాలో ఘోర విషాదం జరిగింది. మరికల్ మండలం తీలేరులో మట్టిపెళ్లలు మీదపడిన ఘోరమైన దుర్ఘటనలో 8 మంది కూలీలు చనిపోయారు.

పొట్టకూటి కోసం పనిచేసుకునే కూలీలే ప్రమాదంలో చనిపోయారని తెలుస్తోంది. మట్టిపెళ్లల కింద ఇంకా కొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రమాదం సంగతి తెలియగానే గ్రామస్తులు ఘటనా స్థలానికి పరుగెత్తుకొచ్చారు. మట్టి పెళ్లల కిందున్న వారిని వెలికి తీశారు. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలను బయటకు తీశారు. మరో ఇద్దరిని ప్రాణాలతో కాపాడారు. వారిని దవాఖానాకు తరలించారు.

గ్రామస్తుల సమాచారంతో పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. జేసీబీల సాయంతో మట్టిదిబ్బలను వేరు చేస్తున్నారు. మట్టిదిబ్బల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు.

ఉపాధి హామీ కూలీలు తమ పనులు చేస్తున్న టైమ్ లో ఈ సంఘటన జరిగింది. ఉదయం ఏడు గంటలకు దాదాపు వందమంది ఇక్కడకు వచ్చినట్టు తెలుస్తోంది. ఓ పెద్ద గుట్టకు సంబంధించిన మట్టిని తొలగిస్తున్న టైమ్ లో ఈ ప్రమాదం జరిగింది. మట్టి కింద లోపల ఎంతమంది ఉన్నారో ప్రస్తుతానికి తెలియడం లేదని… సహాయక చర్యలు వేగంగా చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. రెవెన్యూ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్ స్పాట్ కు చేరుకున్నారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.