నాకేం తక్కువ!.. కేబినెట్ రేసులో కమలం లీడర్లు

నాకేం తక్కువ!..  కేబినెట్ రేసులో కమలం లీడర్లు
  •  మంత్రిపదవి ఆశిస్తున్న 8 మంది తెలంగాణ ఎంపీలు
  •  రకరకాల ఈక్వేషన్స్ తో ప్రయత్నాలు
  •  సంకీర్ణ  సర్కారులో రాష్ట్రానికి ఎన్ని మంత్రపదవులొస్తాయో..
  •  కిషన్ రెడ్డి కే ఇచ్చి చేతులు దులుపుకొంటారా?
  •  ఇంకా ఎవరికైనా అవకాశం దక్కుతుందా..?
  •  ఆసక్తికరంగా మారిన కేంద్ర కేబినెట్ కూర్పు

హైదరాబాద్: రేపు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు కొలువుదీరనుంది. 2019లో మోదీ రెండో సారి ప్రధానిగా ప్రమాణం చేసిన సమయంలో సికింద్రాబాద్ నుంచి గెలుపొందిన కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సారి రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ గెలుచుకుంది. ఈ సారి విజయం సాధించిన వారంతా కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నారు. వీళ్లంతా రకరకాల ఈక్వేషన్లతో తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. 

గతంలో బీజేపీకి 303 సీట్లు రావడంతో లోక్ సభలో పూర్తి స్థాయి మెజార్టీ ఉండేది. ఇప్పుడు 241 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మొత్తంగా 62 సీట్లను బీజేపీ కోల్పోయింది. ఈ సారి అధికారం చేపట్టాలంటే ఎన్డీఏలోని అన్ని పక్షాల మద్దతు తప్పని సరి, ముఖ్యంగా టీడీపీ, జేడీయూ సంపూర్ణంగా సహకరిస్తేనే సర్కారు మనుగడ ఉంటుంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలను కలుపుకొని పోతూ కేబినెట్ కూర్పు ఉండాలి. ఈ తరుణంలో రాష్ట్రానికి ఎన్ని మంత్రిపదవులు దక్కుతాయనేది హాట్ టాపిక్ గా మారింది. 

రేసులో 8 మంది ఎంపీలు

తెలంగాణ నుంచి గెలుపొందిన ఎనిమిది మంది  ఎంపీలు  మంత్రిపదవి రేసులో ఉన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో పనిచేసిన, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. పార్టీ విజయానికి కృషి చేయడంలో కీలక పాత్ర పోషించడం, అపారమైన రాజకీయ అనుభవం, మంత్రిగా పనిచేసిన ఎక్స్ పీరియన్స్ కోటాలో ఆయన మంత్రిపదవిని ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మహిళా, సీనియారిటీ కోటాలో కేబినెట్ రేసులో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ ను ఓడించగలిగానని ఆమె క్లెయిమ్ చేసుకుంటున్నారు. 

అయితే  ఏపీ నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 2,39,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహిళకు ఇవ్వాల్సి వస్తే పురంధేశ్వరీ, డీకే అరుణలో ఎవరో ఒకరికి దక్కుతుందనే చర్చ కూడా  నడుస్తోంది.  మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి 3,91,475 మెజార్టీ సాధించి ఈటల రాజేందర్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. అపారమైన రాజకీయ అనుభవం ఉండడం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, బీజేపీలో జాయినింగ్స్ కమిటీ కన్వీనర్ గా పనిచేశారు ఈటల రాజేందర్. ఆయన ఈ సారి కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ నుంచి రెండో సారి ఎంపీగా గెలిచిన బండి  సంజయ్ కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారు. 


రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలు అందించడంతో పాటు తన వాగ్ధాటి, సంచలన కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న సంజయ్ కేంద్ర మంత్రిపదవిని ఆశిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన సంజయ్ సామాన్య కార్యకర్త నుంచి ఎంపీగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరకు ఎదిగారు. నిజామాబాద్  నుంచి ఎంపీగా రెండోసారి గెలుపొందిన ధర్మపురి అర్వింద్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో.. రెండో సారి ఎంపీగా గెలుపొందడం తనకు కలిసి వస్తుందనే ధీమాలో అర్వింద్ ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి గెలుపొందిన గోడెం నగేశ్ కూడా ఎస్టీ కోటాలో కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారు. 30 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న నగేశ్ ఎన్టీఆర్ మంత్రి వర్గంలో రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. సామాజిక వర్గ కూర్పు, అపారమైన రాజకీయ అనుభవం తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కేంద్ర కేబినెట్ రేసులో ఉన్నారు. 

2014 లో బీఆర్ఎస్ తరఫున కొండా విశ్వశ్వర్ రెడ్డి ఎంపీగా గెలిచారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 2019లో టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం, తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం,  ఎంపీగా పనిచేసిన అనుభవం తనకు కలిసి వస్తాయని కొండా భావిస్తున్నారు. మెదక్ నుంచి విజయం సాధించిన రఘునందన్ రావు కూడా కేంద్ర కేబినెట్ బెర్త్ పై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రఘునందన్ రావు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రఘునందన్ రావుకు హైకోర్టు న్యాయవాదిగా, వాగ్ధాటి ఉన్నరాజకీయ నాయకుడిగా పేరుంది. ఇవన్నీ తనకు కలిసి వస్తాయని భావిస్తున్న రఘునందన్ రావు కేంద్ర మంత్రి వర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్నారు.
 
 

సంకీర్ణంలో సాధ్యమేనా?

 

ఎన్డీఏ సర్కారుకు అరకొర మెజార్టీ రావడం వల్ల కచ్చితంగా మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు వీలైనన్ని ఎక్కువ మంత్రిపదవులు ఇవ్వాల్సి వస్తుంది. ఏపీలో గెలిచిన టీడీపీ, జనసేన, నీతీశ్ నేతృత్వంలోని జేడీయూ తదితర పార్టీలు  మంత్రి పదవులను ఆశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎన్ని మంత్రిపదవులు వస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రిగా అనుభవం ఉన్న కిషన్ రెడ్డికి మాత్రమే అవకాశం ఇచ్చి చేతులు దులుపుకొంటారా..? ఆయనతో పాటు ఇంకా ఎవరికైనా ఇస్తారా.. అనేది హాట్ టాపిక్ గా మారింది.