మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల చిన్నారిని అతి వేగంగా వచ్చిన కారు ఈడ్చుకెళ్లింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడు ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..సీసీ టీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
గ్వాలియర్ పట్టణంలో గోలాలోని మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భింద్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మొరెనా జిల్లాకు చెందిన విక్రమ్ సింగ్ రాథోడ్ తన భార్య, 8 ఏళ్ల కుమారుడు అథర్వతో కలిసి తన అత్తమామల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో భింద్ రోడ్డులో పక్కన తన యాక్టివా స్కూటీని ఆపేశాడు. ఈ సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు..యాక్టీవా స్కూటీని బలంగా ఢీకొట్టింది. అనంతరం బాలుడు అథర్వను అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడి తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి..
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విక్రమ్ సింగ్ కుమారుడు అథర్వ రాథోడ్ ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా నిందితుడి ఆచూకి దొరకలేదు. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.