
- హైకోర్టు సీజేను కోరిన లాయర్ చిక్కుడు ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై శుక్రవారం ‘వీ6 వెలుగు డిజిటల్ ఎడిషన్’లో వచ్చిన వార్తను సుమోటోగా స్వీకరించాలని లాయర్ చిక్కుడు ప్రభాకర్ హైకోర్టుకు లేఖ రాశారు. ఇదే తరహా ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో జరిగిందని, ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఈ పిల్ విచారణలో ఉందని, కాజీపేట ఘటనను కూడా దీనితో కలిపి విచారించి, బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని శుక్రవారం హైకోర్టు సీజేకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది వీధి కుక్కలు రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయని, వాటి గురించి మున్సిపాలిటీలు పట్టించుకునేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లల్లో కూడా వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు భారీగా కుక్క కాటు కేసులు నమోదైనా.. అధికారులు మాత్రం నివారణ చర్యలు తీసుకోలేదన్నారు.