వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి ధీక్షిత అనే నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బాత్రూం వద్ద వేలాడుతున్న విద్యుత్ వైరు విద్యార్థిని కాలికి తగిలి కిందపడడంతో చేతితో ఆ వైర్లు తొలగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కరెంటు షాక్ తగిలి విద్యార్థిని చేతికి, కాళ్ళకు తీవ్ర గాయాలై కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్, స్థానికులు పరిగిలోని ఓ ప్రైవేట్ హస్పిటల్ కు తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇదే విద్యార్థినితో పాటు మరో నలుగురు విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ధీక్షితకు కరెంటు షాక్ తగలగానే ఒక్కసారిగా భయపడ్డ తోటి విద్యార్థినిలు వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఒక వేళ వీరు కూడా ధీక్షితను పైకి లేపే ప్రయత్నం చేసి ఉన్నట్లైతే తీవ్ర విషాదమే మిగిలేది. దీక్షిత మృతికి పాఠశాల ఉపాధ్యాయులతోపాటు, స్కూల్ మరమ్మతులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని.. బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యే స్కూల్ మరమ్మతులు కొనసాగుతున్నాయి.