చదరంగంలో కొత్త చిరుత: చెస్‌‌‌‌లో దూసుకొస్తున్న హైదరాబాద్ బుడ్డోడు దివిత్ రెడ్డి

చదరంగంలో కొత్త చిరుత: చెస్‌‌‌‌లో దూసుకొస్తున్న హైదరాబాద్ బుడ్డోడు దివిత్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:చెస్ పుట్టినిల్లు ఇండియాలో ఎంతో మంది మేటి ఆటగాళ్లు ఈ ఆటలో అదరగొడుతున్నారు. ఈ మధ్యే చెస్ ఒలింపియాడ్‌‌‌‌లో రెండు బంగారు పతకాలతో ఇండియా చరిత్ర సృష్టించింది. ఆ విజయంలో తెలంగాణ ఆటగాడు ఎరిగైసి అర్జున్ కీలక పాత్ర పోషించాడు. తన ఆటతో ఇండియా నంబర్ వన్‌‌‌‌గా నిలిచిన అర్జున్‌  వరల్డ్ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌ ర్యాంక్‌కు అడుగు దూరంలో ఉన్నాడు.  అతని బాటలో మన రాష్ట్రం నుంచి మరో  కుర్రాడు దూసుకొస్తున్నాడు.

పిట్ట కొంచెం–కూత ఘనం అన్నట్టు ఎనిమిదేండ్ల వయసులోనే  విశ్వవేదికపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ  ఇండియన్‌‌‌‌ చెస్‌‌‌‌లో నయా సంచలనంగా మారాడు. అతనే హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఎదుల్ల దివిత్ రెడ్డి.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో జరిగిన వరల్డ్‌‌‌‌ క్యాడెట్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో గోల్డ్‌‌‌‌, బ్లిట్జ్‌‌‌‌ పోటీల్లో బ్రాంజ్ నెగ్గి ఔరా అనిపించిన ఈ బుడ్డోడు తాజాగా ఇటలీలో జరిగిన వరల్డ్‌‌‌‌ క్యాడెట్‌‌‌‌ చెస్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో గోల్డ్ మెడల్ (అండర్‌‌‌‌‌‌‌‌–8) సాధించాడు. ఎన్నో దేశాల ఆటగాళ్లు పోటీ పడ్డ ఈ టోర్నీలో ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అండర్‌‌‌‌‌‌‌‌–8 వరల్డ్  చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌ హోదా సాధించి వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు.    


గుకేశ్‌‌‌‌ను ఆశ్చర్యపరిచి..

వరల్డ్ క్యాడెట్స్ టోర్నీలో గోల్డ్ నెగ్గడంతో దివిత్‌‌‌‌ ఇప్పుడు చెస్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టోర్నీలో కఠినమైన పోటీలోనూ ప్రశాంతంగా ఆడుతూ.. మధ్యలో వెనుకబడినా అద్భుతంగా పుంజుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి ఆట దివిత్‌కు కొత్తేం కాదు. తనకు ఆరేండ్ల వయసున్నప్పుడే ఇండియా గ్రాండ్ మాస్టర్, ప్రస్తుతం డింగ్ లిరెన్‌‌‌‌తో వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టైటిల్ కోసం తలపడుతున్న డి. గుకేశ్‌‌‌‌ను ఆశ్చర్యపరిచాడు.  రెండేండ్ల  కిందట  హైదరాబాద్‌‌‌‌లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ ఈవెంట్‌‌‌‌లో గుకేశ్‌‌‌‌తో పోటీ పడ్డ దివిత్‌‌‌‌ ఎలాంటి బెరుకు లేకుండా ఎత్తులు వేశాడు.

అత్యంత సవాల్‌‌‌‌తో కూడిన ఎండ్ గేమ్‌‌‌‌లో అద్భుతమైన నైపుణ్యాన్ని చూపెడుతూ గుకేశ్‌‌‌‌కు గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు గుకేశ్‌‌‌‌తో పాటు ఎరిగైసి అర్జున్‌‌‌‌ చేతిలో ఓడిపోయాడు. కానీ, ఈ బుడ్డోడి టాలెంట్‌‌‌‌ చూసి గుకేశ్ ఫిదా అయ్యాడు. ‘ఈ కుర్రాడు అనూహ్యంగా ఆడుతున్నాడు. తన ఎత్తులు చూసి  నేను షాక్ అయ్యాను’ అని చెప్పిన గుకేశ్‌‌‌‌.. దివిత్‌‌‌‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. తకు మంచి భవిష్యత్ ఉందని చెప్పాడు. గుకేశ్‌ అంచనా నిజమైంది. రెండేండ్లు తిరగకుండానే దివిత్‌ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.

పజిల్స్‌‌‌‌తో మొదలు పెట్టి..

దివిత్‌‌‌‌ చెస్ పజిల్స్‌‌‌‌తో ఈ ఆటను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే 64 గడులపై పట్టు సాధించాడు. అతని తల్లిదండ్రులు మహేశ్ రెడ్డి, సింధుజ సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజినీర్లు. నల్లగొండ జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్‌‌‌‌లో స్థిరపడ్డ వీళ్లకు ఎలాంటి స్పోర్ట్స్‌‌‌‌ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ లేదు. కానీ, చెస్‌‌‌‌పై అవగాహన ఉంది. చిన్నప్పుడు దివిత్‌‌‌‌కు ఓ చెస్ పజిల్‌‌‌‌ ఇస్తే వెంటనే సాల్వ్‌‌‌‌ చేశాడు. అప్పటి నుంచి  ప్రతి రోజూ పజిల్స్ ఇవ్వడం మొదలు పెట్టారు.  రోజుకు 100–200 పజిల్స్‌‌‌‌నూ వేగంగా సాల్వ్‌‌‌‌ చేయడంతో  తనకు చెస్‌‌‌‌పై ఆసక్తి ఉందని గుర్తించి వివిధ టోర్నీల్లో ఆడించడం ప్రారంభించారు. వైజాగ్‌‌‌‌కు చెందిన కోచ్ రామకృష్ణ తో  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో కోచింగ్‌‌‌‌ ఇప్పిస్తున్నారు.

రామకృష్ణ కోచింగ్‌‌‌‌, తల్లిదండ్రుల సపోర్ట్‌‌‌‌తో  ఆటను అవపోసన పడుతున్న దివిత్‌‌‌‌  తనకంటే ఎక్కువ ఏజ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ల్లోనూ పోటీ పడి పతకాలు తెస్తున్నాడు. ఏడేండ్లకే అండర్‌‌‌‌‌‌‌‌–9 స్టేట్ చాంపియన్‌‌‌‌గా నిలిచిన ఈ కుర్రాడు వేగంగా , దూకుడుగా ఎత్తులు వేయగలడు. ఈ స్కిల్స్‌ తో  వరల్డ్‌‌‌‌ క్యాడెట్ ర్యాపిడ్‌‌‌‌, బిట్జ్‌‌‌‌ టోర్నీలో గోల్డ్‌‌‌‌, బ్రాంజ్ నెగ్గి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే, క్లాసికల్ ఈవెంట్‌‌‌‌లో  నేషనల్‌‌‌‌ లెవెల్లో ఒక్క మెడల్ కూడా నెగ్గలేకపోయిన దివిత్‌‌‌‌ ఇప్పుడు ఏకంగా వరల్డ్ క్యాడెట్ చాంపియన్‌‌‌‌గా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా  తనలో ఉందని నిరూపించుకున్నాడు.

సపోర్ట్ కావాలె

వరల్డ్ యంగెస్ట్  గ్రాండ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కావాలన్నది దివిత్‌‌‌‌ లక్ష్యం. అమెరికాకు చెందిన అభిమన్యు మిశ్రా 12 ఏండ్ల 4 నెలల 25 రోజుల వయసులో జీఎం హోదా సాధించి రికార్డు సృష్టించాడు. దివిత్ రాబోయే రెండు, మూడేండ్లలో జీఎం హోదా సాధించగలడని తండ్రి మహేశ్ రెడ్డి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆ దిశగా తనను తీర్చిదిద్దాలంటే ఇప్పటినుంచి మరింత మెరుగైన కోచింగ్‌‌‌‌ ఇప్పించాల్సి ఉంటుందని, అందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కావాలని చెబుతున్నారు.

‘దివిత్‌‌‌‌ను ఈ స్థాయికి తీసుకురావడానికి నేను, నా భార్య కష్టపడుతున్నాం. కోచింగ్‌‌‌‌, టోర్నీల్లో ఆడేందుకు వివిధ నగరాలు, దేశాల ప్రయాణాలకు చాలానే ఖర్చవుతోంది. స్పాన్సర్‌‌‌‌‌‌‌‌షిప్స్ కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం,  స్పాన్సర్లు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే మా అబ్బాయి కచ్చితంగా  మరిన్ని విజయాలు సాధిస్తాడు’ అని మహేశ్ రెడ్డి  ‘వెలుగు’తో చెప్పారు.