ఆర్టీసీ బస్టాండ్​కు రూ. 80లక్షలు ఇచ్చిన వైనం

ఆర్టీసీ బస్టాండ్​కు రూ. 80లక్షలు ఇచ్చిన వైనం
  • ఆర్టీసీ బస్టాండ్​కు రూ.80లక్షలు ఇచ్చిన వైనం
  • ఉన్నతాధికారుల మెప్పు కోసమేనన్న ఆరోపణలు 
  • ఆఫీసర్ల తీరుపై ప్రతిపక్షం తోపాటు అధికార కౌన్సిలర్ల మండిపాటు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం జిల్లా కేంద్రంగా మారడంతో పట్టణం నలువైపులా పెరుగుతోంది. ఈ క్రమంలో పట్టణ జనాభాతోపాటు వారి అవసరాలు పెరుగుతున్నాయి. ఈ అవసరాలను మున్సిపాలిటీ తీర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే పట్టణం డ్రైనేజీలు, తాగునీటి కొరత, శిథిలమైన ఇంటర్నల్​రోడ్స్, వీధి లైట్ల మెయింటనెన్స్​లేకపోవడం.. తదితర సమస్యలతో సతమతమవుతోంది. కొంతకాలంగా మున్సిపాలిటీలో ఫండ్స్​కొరత వేధిస్తోంది. ఈ క్రమంలో పట్టణ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఫండ్స్​లేకపోయినా.. తన పరిధిలోకి రాని ఆర్టీసీ బస్టాండ్​ అభివృద్ధికి రూ.80లక్షలు కేటాయించడం చర్చనీయాంశమైంది. ఇదంతా ఉన్నతాధికారుల మెప్పు కోసమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మున్సిపాలిటీలో పైసల్లేవ్.. 
కొత్తగూడెం పట్టణంలో రోడ్ల రిపేర్లకు, డ్రైన్ల నిర్మాణాలకు మున్సిపాలిటీలో పైసల్లేవ్​. కానీ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్​ అభివృద్ధికి కలెక్టర్​ చెప్పారని రూ. 80లక్షలు కేటాయించినట్లు మున్సిపాలిటీ ఆఫీసర్లు, పాలకవర్గం చెబుతున్నారు.

సమస్యలతో సతమతం
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం సమస్యలతో సతమతమవుతోంది. పట్టణంలోని పలు వార్డులలో డ్రైనేజీలతో పాటు రోడ్ల నిర్మాణాలకు నిధులివ్వాలంటూ పలు మీటింగ్​లలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు గొడవ పెడుతూనే ఉన్నారు. పట్టణంలో మంచినీటి ఎద్దడి నివారణతో పాటు వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు ఫండ్స్​కేటాయించాలని చైర్​పర్సన్​ కాపు సీతాలక్ష్మితోపాటు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును అడుగుతున్నారు. పట్టణంలోని బూడిదగడ్డ, కూలీలైన్​, రామవరం, మేదరబస్తీ తదితర ప్రాంతాల్లోని పలు వీధుల్లో సరైన డ్రైనేజీలు లేవు, రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. నీటి ఎద్దడితో ప్రజలు తిప్పలు పడుతున్నారు. సూపర్​బజార్​నుంచి ముర్రేడు వాగు బ్రిడ్జి వరకు ఒక్క సులభ్​ కాంప్లెక్స్​ కూడా  లేకపోవడంతో ఒకటికి రెండుకు ఉగ్గపట్టుకోవాల్సిన పరిస్థితి. పట్టణంలోని రోడ్లు, డ్రైన్లు, నీటి ఎద్దడి నివారణ, వీధిలైట్ల కోసం ఫండ్స్​ కేటాయించాలని అడుగుతుంటే చూద్దామంటూ ఆఫీసర్లు, పాలకులు దాటవేస్తున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉంది, బస్టాండ్​ అభివృద్ధికి నిధులు లేవు, మీ మున్సిపాలిటీ నుంచి బస్టాండ్​ అభివృద్ధికి రూ. 80లక్షలు ఇవ్వాలని కలెక్టర్​ చెప్పగానే ఆఫీసర్లు, చైర్​పర్సన్​ స్పందించారు. మూడు రోజుల కిందట జరిగిన కౌన్సిల్​ మీటింగ్​లో ఫండ్స్​ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఐదారు నెలల కిందట రామవరంలో రూ. కోట్లతో నిర్మించిన మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో పలు అభివృద్ధి పనులు, గ్రీనరీ, పార్కుల పేర దాదాపు రూ. 65 లక్షల వరకు మున్సిపాలిటీ నుంచి కేటాయించడం గమనార్హం. ఈ నిధుల కేటాయింపులోనూ ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్​ చెప్పారంటూ అధికారులు, చైర్​పర్సన్​ చెప్పి కౌన్సిలర్లను సముదాయించినట్లు సమాచారం. బస్టాండ్​అభివృద్ధి అందరికీ ఉపయోగకరమే కానీ.. మున్సిపాలిటీ ఫండ్స్​అందుకు కేటాయించడం ఎంత వరకు సమంజసమని కౌన్సిలర్లతో పాటు పట్టణ ప్రజలు.. ఆఫీసర్లు, చైర్​పర్సన్​ను ప్రశ్నిస్తున్నారు. బస్టాండ్​ అభివృద్ధికి ఉమ్మడి జిల్లాకు చెందిన, రవాణా శాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్​కుమార్​ను ఫండ్స్​ అడగకుండా మున్సిపాలిటీ పైసలు ఇవ్వడం ఏంటని బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్​ ప్రశ్నిస్తున్నారు. 

డబ్బుల్లేవని చెప్తూ ఆర్టీసీకి ఎట్లా ఇస్తరు 
పట్టణంలోని పలు బస్తీలలో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది. డ్రైనేజీలు అస్తవ్యవస్థంగా ఉండడంతో మురుగునీరు రోడ్లపైకి, ఇండ్ల ముందుకు వస్తోంది. మురుగు నీటి నిల్వతో దోమలు పెరిగి ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. పట్టణంలో వార్డుల్లో అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన ఫండ్స్​ఆర్టీసీ సహా ఇతరత్రా వాటికి కేటాయించడం సరికాదు. 
-  వై. శ్రీనివాస్​రెడ్డి, సీపీఐ ఫ్లోర్​ లీడర్​, కొత్తగూడెం మున్సిపాలిటీ  

కలెక్టర్​ సూచనలతోనే ఆర్టీసీకి ఫండ్స్​ఇస్తున్నాం 
ఆర్టీసీ బస్టాండ్​ అధ్వానంగా ఉండడం, వాళ్ల వద్ద ఫండ్స్​లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్​కలెక్టర్​మున్సిపాలిటీ నుంచి పైసలు కేటాయించాలని సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా బస్టాండ్​ అభివృద్ధికి ఫండ్స్​కేటాయింపుపై కౌన్సిల్​ తీర్మానం చేశాం. బస్టాండ్​ కూడా పట్టణంలో భాగమే కావడం, కలెక్టర్​ సూచనలతోనే నిధులును కేటాయించాం. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు కావాలని కలెక్టర్​ను కోరుతున్నాం. 
- కాపు సీతాలక్ష్మి, మున్సిపల్​ చైర్​పర్సన్, కొత్తగూడెం