గోదావరిఖని/కోల్ బెల్ట్, వెలుగు : సింగరేణిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగ నియామకాల్లో ఇకపై 80 శాతం స్థానికులకే అవకాశమివ్వాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు మేనేజ్‌మెంట్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల18న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. వెంటనే స్పందించిన సీఎం.. సింగరేణి ఆఫీసర్లతో మాట్లాడి ఉత్తర్వులు ఇప్పించారు.
దీంతో ఎన్నికల ముందు కోల్బెల్ట్ప్రజలకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నిలుపుకున్నట్లయింది. సింగరేణిలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చాలా డిపార్ట్‌మెంట్లు కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం సింగరేణిలో 52 విభాగాల్లో 26 వేల మంది వరకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓపెన్‌కాస్ట్‌లలో డ్రైవర్లు, హెల్పర్లు, బ్లాస్టింగ్ సెక్షన్ కార్మికులు, మైన్లలో కోల్ కటర్లు, పవర్‌ప్లాంట్‌లో ఇంజినీర్లు, హెల్పర్లు, ఫారెస్ట్, వెహికల్స్, సివిక్, సివిల్, తదితర సెక్షన్లలో కాంట్రాక్టర్ల కింద కార్మికులు డ్యూటీ చేస్తున్నారు.
ఓసీపీల్లో 80 శాతం నాన్ లోకల్సే..
సింగరేణి వ్యాప్తంగా ఉన్న19 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో నాన్ లోకల్సే ఎక్కువగా పనిచేస్తున్నారు. అన్ని ఓసీపీల్లో కలిపి సుమారు12 వేల మంది వరకు చత్తీస్‌గఢ్, బిహార్, ఏపీ, ఒడిశా, బెంగాల్‌కు చెందిన కార్మికులున్నారు. కాంట్రాక్టు సంస్థలు వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులలో షెల్టర్ కల్పించి డ్యూటీ చేయిస్తున్నారు. ఓసీపీల్లో పనిచేసే మొత్తం కాంట్రాక్టు కార్మికుల్లో స్థానికులు 20 శాతం మాత్రమే ఉంటున్నారు. జైపూర్పవర్ ప్లాంట్‌లో 1365 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరిలో 917 మంది (70 శాతం) ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. కేవలం 30 శాతం మాత్రమే స్థానికులను, అది కూడా అన్స్కిల్డ్వర్కర్లుగా తీసుకున్నారు.
స్థానికులకే ఇవ్వాలని సీఎంను కోరిన వివేక్
సింగరేణిలోని అన్ని సెక్టార్లలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ ఈ నెల18వ తేదీన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హైదరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. తాను 2009 నుంచి 2014 వరకు పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో సింగరేణిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని జీవో ఇప్పించానని, కానీ బీఆర్‌ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవోను పక్కనపెట్టిందని వివేక్ గుర్తు చేశారు. దీంతో కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకువచ్చి పనులు చేయించారని, దీనివల్ల స్థానికంగా నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం జరిగిందని సీఎంకు వివరించారు. జైపూర్‌లోని సింగరేణి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు స్థానికులు భూములు ఇచ్చారని, కానీ నిర్వాసితులకు ఉద్యోగాలు దక్కలేదని తెలిపారు. ఓపెన్‌కాస్ట్‌లు, పవర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యాన్ని స్థానిక ప్రజలు భరిస్తూ అనారోగ్యాల పాలవుతున్నారని, అందువల్ల త్వరలో జరగనున్న అగ్రిమెంట్లలో స్థానికులకే ఉద్యోగావకాశం కల్పించేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎంను కోరారు.
సర్క్యులర్‌తో హర్షం
సింగరేణి ప్రభావిత, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే స్థానికులకు, సంస్థ కోసం భూములు అప్పగించిన నిర్వాసితులకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థలకు మేనేజ్‌మెంట్ సర్క్యులర్ జారీ చేసింది. స్కిల్డ్, అన్ స్కిల్డ్ ఉద్యోగాలను 80 శాతానికి తగ్గకుండా స్థానికులకే ఇవ్వాలని ఆదేశించింది. పీడీఎఫ్(ప్రాజెక్టు డిస్‌ప్లేస్డ్ ఫ్యామిలీస్), పీఏఎఫ్(ప్రాజెక్టు ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్), సింగరేణి నిర్వాసిత, ప్రభావిత, భవిష్యత్ ప్రభావిత ప్రాంతాల వారిని స్థానికులుగా గుర్తించి ఈ ఉద్యోగాల ప్రక్రియను చేపట్టాలని సూచించింది.