80% ఇండ్లలో ఇంకుడు గుంతల్లేవ్​

80%  ఇండ్లలో ఇంకుడు గుంతల్లేవ్​
  • 300 చదరపు మీటర్ల ఇండ్లలో జరిపిన పరిశీలనలో వెల్లడి
  • వాటర్​బోర్డు ఆదేశాల తర్వాత 22 వేల ఇంకుడు గుంతల నిర్మాణం
  • ఇక ఇంకుడు గుంత లేని ఇంటి నుంచి ట్యాంకర్​బుక్ చేస్తే చార్జీ వసూలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో 300 చదరపు మీటర్లు ఇండ్లలో 80 శాతం ఇంకుడు గుంతలు లేవని వాటర్​బోర్డు అధికారులు గుర్తించారు. ఇటీవల సర్వే చేయగా 42 వేల ఇండ్లల్లో అసలు ఇంకుడు గుంతలే లేవని తేలింది. 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇండ్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరో 20వేలకు పెరుగుతుంది.

గత వేసవిలో బోర్లు ఎండిపోవడంతో మంచినీటికి డిమాండ్​ఏర్పడి తీవ్ర ఎద్దడి ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వాటర్​బోర్డు ఈ వర్షాకాలం నాటికైనా భూగర్భ జలాలు పెంచాలన్న లక్ష్యంతో 300 చదరపు మీటర్లు ఉన్న ఇండ్లకు ఇంకుడు గుంతలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత సర్వే చేయగా, 22వేల మంది ఇంకుడు గుంతలు నిర్మించుకుంటున్నారని తేలింది.

అలాగే ఇంకుడు గుంతలు లేని 14వేల ఇండ్లకు నోటీసులిచ్చామని రెయిన్​వాటర్​హార్వెస్టింగ్​సెల్​ఆఫీసర్​జాలా సత్యనారాయణ తెలిపారు.  రూ. 40 నుంచి రూ. 50వేలు మాత్రమే ఖర్చవుతుండడంతో జనాలు ఆసక్తి చూపిస్తున్నారని, త్వరలో 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇండ్లకు కూడా ఇంకుడు గుంతలు తప్పనిసరి చేస్తామని చెప్పారు.  

వేసవిలో నీటి ట్యాంకర్లకు రెట్టింపు ధర  

ఇంకుడు గుంతలు నిర్మించుకోని వారు ఎండాకాలంలో నీటి ట్యాంకర్లను బుక్​చేసుకుంటే రెట్టింపు చార్జీలు వసూలు చేయాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. ఈనిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం బోర్డు అధికారులు నిర్వహిస్తున్న సర్వేల ఆధారంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోని వారి క్యాన్​నెంబర్లు, అడ్రస్​లను కంప్యూటరైజ్​ చేస్తున్నట్టు తెలిపారు. మార్చి తర్వాత వారు ఎప్పుడు వాటర్​ట్యాంకర్​బుక్​చేసుకున్నా బుకింగ్​చేస్తే వారింట్లలో ఇంకుడు గుంత ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుందని, దానిని బట్టి వారి నుంచి ట్యాంకర్​ ఛార్జీలను వసూలు చేస్తామని తెలిపారు. 

ఎండిపోయిన బోర్లపై ఫోకస్​

భూగర్భ జలాలను పెంచడానికి సిటీలో నిరుపయోగంగా ఉన్న హ్యాండ్​ బోర్​వెల్స్​ను ఇంజెక్షన్​బోర్​వెల్స్​గా మార్చే పనిలో వాటర్​బోర్డు అధికారులు ఉన్నారు. పాడైన బోర్​వెల్​ను మరో 200 అడుగుల వరకూ తవ్వి దాని చుట్టూ ఇంకుడు గుంత నిర్మిస్తే వర్షాకాలంలో  వరద అందులోకి వెళ్లి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ఇలాంటివి గ్రేటర్​ లో 3,222 గుర్తించామని వాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి తెలిపారు. కోర్‌ సిటీలో 1,665, శివార్లలో 1,557 ఉన్నాయన్నారు.