మహబూబ్‌నగర్/జడ్చర్ల, వెలుగు : జడ్చర్లలోని బాదేపల్లి అగ్రికల్చర్ మార్కెట్ ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ ఆదాయం ఉన్న మార్కెట్. పత్తి, మక్కలు, పల్లి ఇతర పంటల అమ్మకాలతో ఏటా కోట్లల్లో ఇన్‌కం వస్తోంది. కానీ, కొంత కాలంగా మార్కెట్‌కు వస్తున్న ఆదాయంలో దాదాపు 80 శాతం ఖర్చు చూపిస్తున్నారు. కేవలం సిబ్బంది శాలరీలు, మెయింటెనెన్స్‌కే భారీగా ఖర్చు అవుతున్నట్లు లెక్కలు రాస్తున్నారు. హైర్వెహికిల్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు సరిపడా లేకున్నా.. ఎక్కువ మంది ఉన్నట్టు రికార్డులో చూపిస్తూ జీతాల పేర ఎక్కువ ఖర్చయినట్లు చూపిస్తున్నారు.
మూడు నెలల్లో రూ.75 లక్షల ఆదాయం
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లి మార్కెట్‌కు ఈ ఏడాది జూన్‌లో రూ.47,00,353, జులైలో రూ.22,89,947, ఆగస్టులో రూ.5,12,378 కలిపి మూడునెలల్లో రూ.75,02,678 లక్షల ఆదాయం వచ్చింది. ఈ మేరకు అధికారులు సెప్టెంబరు 14న సాధారణ సమావేశం నిర్వహించి, ఇన్కంతో పాటు ఖర్చుల గురించి వివరించారు. జూన్‌లో రూ.13,76,176, జులైలో రూ.18,14,227, ఆగస్టులో రూ.30,70,283 లక్షలు.. మొత్తం రూ.62,60,686 లక్షలు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. రూ.12,41,992 మాత్రమే మిగిలినట్లు చూపించడంతో పాలక వర్గం సభ్యులు ఖంగుతిన్నారు.
ఇష్టారీతిగా ఖర్చులు
మార్కెట్ చైర్మన్‌తో పాటు ఓ ఆఫీసర్‌కు బాదేపల్లి మార్కెట్ ద్వారా హైర్ వెహికిల్స్‌ను సమకూర్చారు. ఇందు కోసం ఒక్కో వాహనానికి నెలకు రూ.34 వేల చొప్పున రెండింటికి రూ.68 వేలు చెల్లిస్తున్నారు. కానీ, ఖర్చులో హైర్ వెహికిల్స్‌కు జులైలో రూ.1.32 లక్షలు, ఆగస్టు రూ.99 వేలు చెల్లించినట్లు చూపించారు. సెక్యూరిటీ గార్డ్స్శాలరీస్ కింద జూన్, జులై, ఆగస్టు నెలల్లో మొత్తం రూ.6,27,480 లక్షలు చెల్లించినట్లు చూపించారు. అంటే నెలకు రూ.2,09,678 జీతాలు కింద చెల్లించినట్లు మెన్షన్ చేశారు. వీరితో పాటు వాచ్మెన్లకు కూడా నెలకు రూ.22,320 చొప్పున మూడు నెలలకు రూ.66,960 చెల్లించినట్లు చూపించారు. ఈ లెక్కన సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్లు కలిపి దాదాపు 25 మంది ఉండాలి. కానీ, మార్కెట్‌యార్డు పరిధిలో మాత్రం సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్లు తొమ్మిది మందే ఉన్నట్లు తెలిసింది. దీనికితోడు కంప్యూటర్ఆపరేటర్లకు నెలకు రూ.55,800 చెల్లిస్తున్నామని, మూడు నెలల్లో రూ.1,67,400 జీతాలకు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే యార్డు క్లీనింగ్ కోసం జులైలో రూ.43,2, ఆగస్టులో రూ.19,200 ఖర్చు చేశారు. ఇలా ఇష్టంమొచ్చినట్లు లెక్కలు చూపించి ఆదాయానికి గండి కొడుతున్నట్లు పాలక వర్గం సభ్యులే ఆరోపిస్తున్నారు.
ప్రశ్నిస్తున్నా.. సమాధానం లేదు
మార్కెట్నిర్వహణపై ప్రస్తుతం ఉన్న పాలక వర్గంలోని కొందరికి అవగాహన లేకపోవడాన్ని కొందరు సిబ్బంది క్యాష్ చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మిగతా సభ్యులు అవినీతి గురించి సమావేశాల్లో ప్రశ్నిస్తున్నా ఎవరూ స్పందించడం లేదు. ప్రతి సమావేశంలో ఆదాయం, ఖర్చు గురించి పూర్తి వివరాలు అందించడం లేదు. దీనికితోడు సమావేశాలకు మీడియాకు కూడా అనుమతి లేకపోవడంతో మార్కెట్ సిబ్బంది పెత్తనం నడుస్తోందనే టాక్ ఉంది.
అవకతవకలు జరగడం లేదు
బాదేపల్లి మార్కెట్ పరిధిలో చైర్మన్‌కు, డీఎంవోకు హైర్ వెహికిల్స్ అలవెన్స్ ఇస్తున్నాం. మార్కెట్లో పది మంది సెక్యూరిటీ గార్లు ఉండగా, కాటన్ మార్కెట్ వద్ద నలుగురు, మిడ్జిల్ చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు పని చేస్తున్నారు. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఉండగా ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నం. మార్కెట్‌కు వస్తున్న ఆదాయంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదు. చేసిన ఖర్చు వివరాలనే ఎజెండాలో పొందుపరుస్తున్నం.
- నవీన్, మార్కెట్ కార్యదర్శి, బాదేపల్లి
రెండు నెలలే వచ్చినయ్..
నేను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై తొమ్మిది నెలలు అవుతోంది. ఇంత వరకు నాకు రెండు సార్లే వెహికిల్ అలవెన్స్ ఇచ్చారు. ఇంకా ఏడు నెలలకు సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది. మార్కెట్‌కు వస్తున్న ఆదాయంలో అవినీతి జరుగుతోందనే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరన్నా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే చర్చలు తీసుకుంటం.
– శ్యాంసుందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, బాదేపల్లి