బోలే బాబా ప్రవచనాలకు పోటెత్తిన భక్తులు..80 మందిపైగా మృతి 

బోలే బాబా ప్రవచనాలకు పోటెత్తిన భక్తులు..80 మందిపైగా మృతి 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ లో బోలో బాబా చాలా ఫేమస్.. ఆయన చెప్పే ప్రవచనాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే 2024, జూలై 2వ తేదీ పెద్ద ఎత్తున ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా తరలివచ్చారు. ఈవెంట్ ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 80 మంది భక్తులకు పైగా చనిపోయారు. మరో 150 మంది భక్తులు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

బోలో బాబా ఘటన తర్వాత యూపీ సర్కార్ అప్రమత్తం అయ్యింది. పోలీస్ ఉన్నతాధికారులతోపాటు జిల్లా అధికారులు మొత్తం ఉరుకులు పరుగులు పెట్టారు ఆశ్రమం దగ్గరకు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రవచనాల వేదిక దగ్గర సరైన స్థలం లేదని.. ఒక్కసారిగా వేలాది మంది భక్తులు లోపలికి వెళ్లేందుకు తోసుకుని రావటం తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు పోలీసులు. 

ఈ ప్రమాదంతో బోలే బాబా ఆశ్రమం ప్రాంతం మొత్తం హాహాకారాలతో మార్మోగింది. మృతదేహాలతో మరుభూమిని తలపించింది. హత్రాస్ ప్రభుత్వ ఆస్పత్రి బయట మృతదేహాలను వరసగా పెట్టారు. ఈ ఫొటో అందరినీ కలిచి వేస్తుంది. చనిపోయిన ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 50 వేల పరిహారం ప్రకటించారు యూపీ సీఎం యోగి. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించింది యూపీ సర్కార్.