
- బయో ఏషియాలో ఉత్పత్తులను ప్రదర్శించిన సంస్థలు
- రాష్ట్ర సర్కారుతో అంతర్జాతీయ కంపెనీల ఒప్పందం
- గ్రీన్ ఫార్మా సిటీలో 5,445 కోట్ల పెట్టుబడులకు మరో11 సంస్థల ఎంవోయూ
- ఒప్పందాలతో 22,300 మందికి ఉపాధి అవకాశాలు
హైదరాబాద్, వెలుగు: కొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చిన స్టార్టప్‌లకు బయో ఏషియా సదస్సు వేదికగా నిలిచింది. మంగళవారం 80 స్టార్టప్‌లు ఈ సదస్సులో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. వాటితో పాటు 70కిపైగా సంస్థలు తమ వ్యాపార విస్తరణపై స్టాల్స్ పెట్టాయి. ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ స్టేట్ కూడా పెట్టుబడులకు సంబంధించి స్టాల్‌ను ఏర్పాటు చేయగా.. కర్నాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. ఎంఎస్ఎంఈ కింద ఏర్పాటైన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకున్నాయి. కాగా, ఈ సదస్సు వేదికగా తెలంగాణ రాష్ట్రంతో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ఎజిలీసియం.. హైదరాబాద్‌లోని ఆర్ఎంజెడ్ స్పైర్లో కొత్త ఆఫీసు ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకుంది. అలాగే.. ఏఎల్ఎస్ అనే కంపెనీ ఔషధాల టెస్టింగ్, ఇన్స్పెక్షన్, సర్టిఫికేషన్, వెరిఫికేషన్ సొల్యూషన్స్‌కు సంబంధించి జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా సీజీఎంపీ టెస్టింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది.
మైషి ఫార్మా హైదరాబాద్‌లో రెండో ఆర్అండ్డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. గ్రాన్యూల్స్, ఆర్బిక్యులర్, ఐజంట్, బయోలాజికల్ ఈ, విర్కో, విరూపాక్ష, జుబిలెంట్, విమ్టా, అరాజెన్, భారత్ బయోటెక్, సాయి లైఫ్‌సైన్సెస్ వంటి సంస్థలు.. గ్రీన్ ఫార్మా సిటీలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో రూ.5,445 కోట్ల పెట్టుబడులతో పాటు 9,800 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఈ 11 సంస్థలతో పాటు ఇంతకుముందు ఏర్పాటైన ఆరు సంస్థలు కలిపి మొత్తంగా గ్రీన్ ఫార్మా సిటీలో రూ.11,100 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సమకూరినట్లయింది. 22,300 మందికి ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. మరోవైపు అధునాతన పరిశోధన వసతులు, డిజిటల్ హెల్త్‌కేర్, ఏఐ ఇన్నొవేషన్స్కు సంబంధించి తెలంగాణతో యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ కీలక ఒప్పందం చేసుకున్నది.
ఇన్నొవేటివ్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించిన రేవంత్
రాష్ట్రంలో ఇన్నొవేటివ్ ఫార్మాస్యూటికల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ (ఐపీఎస్వో) ను బయోఏషియా వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలను తీర్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు 11 సంస్థలు సంయుక్తంగా ఈ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశాయి. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్‌తో మాంచెస్టర్‌కు చెందిన ఐ హెల్త్ ఇన్నొవేషన్ కీలక ఒప్పందం చేసుకున్నది. హెల్త్‌కేర్, మెడ్‌టెక్, డయాగ్నస్టిక్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నారు. కాగా, ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ సోమ్‌నాథ్ సహా పలు సంస్థలకు చెందిన చైర్మన్లు, సీఈవోలు పానెల్ డిస్కషన్లో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.