ఇంకా నీటిలోనే 800 కాలనీలు

మూడ్రోజులుగా నిద్రలేకుండా గడుపుతున్న జనం

హైదరాబాద్​లో వాన తగ్గినా వీడని వరద

టోలీచౌకి, జాంబాగ్​లో 12 ఫీట్లమేర నిలిచిన నీరు 

నడుములోతు నీటిలో 200 కాలనీలు

సాయం అందించడంలో ప్రభుత్వం ఫెయిలైందని బాధితుల ఆవేదన

హైదరాబాద్, వెలుగు: వానలు తగ్గినప్పటికీ వరద మాత్రం వీడటంలేదు. గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో మూడోరోజు గురువారం కూడా 800 కాలనీలు నీటిలోనే ఉన్నాయి. చాలా కాలనీల్లో 12 ఫీట్ల నీరు నిలిచింది.  పలు కాలనీల్లో బురద పేరుకుపోయింది. 200 కాలనీలు నడుములోతు నీటిలోనే ఉండిపోయాయి. కొన్ని కాలనీల్లో ఎన్ని ప్రయత్నాలు చేసిన నీటి ప్రవాహం తగ్గడంలేదు. సమయానికి ఆహారం లేక బాధితులు పస్తులు ఉంటున్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో మూడ్రోజులుగా కరెంట్​ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారుల నుంచి కిలోమీటర్ల మేర కాలనీల వరకు నీరు ఉండటంతో జనం బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కొన్ని చోట్ల  స్థానిక యూత్​ డేర్​ చేసి ఇండ్లల్లో ఉన్నవారికి వాటర్​ ప్యాకెట్లు, భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు. ప్రభుత్వం కనీస ఏర్పాట్లు కల్పించడంతో ఫెయిలైందని స్థానికులు మండిపడ్డారు. ఇటువంటి ఎమర్జెన్సీ సమయంలో బాధితులకు భరోసా ఇవ్వల్సిన ప్రజాప్రతినిధులు పత్తాలేకుండా పోయారని పలు ప్రాంతాల్లో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బల్దియాకు వేయి ఫిర్యాదులు​

వాటర్​ లాగింగ్​, డ్రైనేజీ ఓవర్​ ఫ్లో, మ్యాన్​హోల్స్ కవర్స్​ ఓపెన్​, మ్యాన్​హోల్​ డ్యామెజ్, భ‌‌వ‌‌నాలు, ప్రహరీ గోడ‌‌లు  కూలిపోవ‌‌డం, చెట్ల కొమ్మలు విరిగిప‌‌డ‌‌డం, చెట్లు నేల కూల‌‌డం, రోడ్ల రిపేర్లు వంటి ఫిర్యాదులతో గురువారం ఒక్క రోజులో 1033 కాల్స్ బల్దియాకు అందాయి.  అయితే బల్దియా కాల్ సెంటర్​ నెంబర్​ కలవకపోవడం, కలిసినా లిఫ్ట్ చేయకపోవడంతో డయల్​ 100కి కాల్స్ వెల్లువెత్తాయి.

కీలక  ఆఫీసర్​ డబుల్‌‌ రోల్‌‌ చేయాల్సి పరిస్థితి

పబ్లిక్‌‌ హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌, జీహెచ్‌‌ఎంసీల్లో ఈఎన్‌‌సీ (చీఫ్ ఇంజనీర్ ) లాంటి కీలక పదవిలో ఒకే ఆఫీసర్​ కొనసాగడంతో వరదలు, ప్రకృతి విపత్తుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.  రాష్ట్రంలోని మేజర్​ మున్సిపల్‌‌ కార్పొరేషన్లు వరంగల్‌‌, కరీంనగర్‌‌, ఖమ్మం, నిజామాబాద్‌‌, నల్గొండ ఇలా రాష్ట్రంలోని కార్పొరేషన్లలో పనులు కూడా ఈయనే పర్యవేక్షించాలి. అదే విధంగా జీహెచ్‌‌ఎంసీ పరిధిలోని నాలాలు, డ్రైనేజీ, ఫ్లైఓవర్‌‌లు ఇలా అన్నింటికి సంబంధించి కింది స్థాయి అధికారులు ప్రపోజల్స్‌‌ను చీఫ్‌‌ ఇంజనీర్‌‌ పర్యవేక్షించి అప్రూవల్‌‌ చేయాల్సి ఉంటుంది.  ప్రత్యక్షంగా గ్రౌండ్​లెవల్​కు  వెళ్లి పనులను పర్యవేక్షించి గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇస్తేనే ఆయా పనులు పూర్తవుతాయి. కానీ జోడు పదవులు నిర్వహిస్తున్న ఆఫీసర్​కు  ఇవన్నీ వీలు పడకపోవడంతో పర్యవేక్షణ కొరవడుతున్నట్లు తెలుస్తున్నది. తాజాగా హైదరాబాద్‌‌లో వర్షాలతో వరద బీభత్సం, నాలాలు పొంగిపొర్లడం, రోడ్లన్నీ జలమయమై వరదలు ముంచెత్తాయి. అదే విధంగా ఇటీవల వరంగల్‌‌లో వర్షాల ధాటికి వర్షపు నీరు పొంగి పొర్లి తీవ్రంగా నష్టం సృష్టించింది. ఇది సదరు చీఫ్ ఇంజనీర్  గ్రౌండ్​లెవల్​ పర్యవేక్షణ లేకేనని విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా జీహెచ్‌‌ఎంసీ పరిధిలోనూ నాలాల పర్యవేక్షణ కొరవడి నాలాలో పడి మృత్యువాత పడిన సంఘటనలు వెలుగు చూశాయి. ఈఎన్‌‌సీ డబుల్‌‌ రోల్‌‌  వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే  జీహెచ్‌‌ఎంసీకి, పబ్లిక్‌‌ హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు కీలకమైన ఈఎన్‌‌సీ పోస్టులకు ఇద్దరు ప్రత్యేక ఆఫీసర్లను నియమించాలనే డిమాండ్‌‌ వ్యక్తమవుతున్నది.

సాయం కోసం ఎదురుచూపులు

టోలీచౌకీలోని నదీం కాలనీ, జాంబాగ్​లోని గణేశ్​ టెంపుల్, దేవీనగర్​, చూడి బజార్‌లతో పాటు తదితర ప్రాంతాల్లో 12 ఫీట్ల మేర నీరు నిలిచింది. ఫలక్​నుమా అల్​జుబైర్​ కాలనీ, బండ్లగూడ అలీనగర్, మీర్​పేట్, ఫిర్జాదిగూడ, ఉప్పల్, ​ఖైరతాబాద్ లోని  పీజేఆర్​ బస్తీ, చాదర్​ఘాట్, శంకర్​ నగర్, రసూల్​పురా, ముసరాంబాగ్​ తో పాటు మొత్తం 200  కాలనీలు నడుములోతు నీటిలోనే ఉన్నాయి.  సహాయక చర్యల కోసం జనం ఇండ్లపైకి ఎక్కి ఎదురుచూస్తున్నారు. 800 కాలనీలు నీటిలో ఉన్నప్పటికీ బల్దియా ఆఫీసర్లు మాత్రం కేవలం 155 ఉన్నట్లు చెబుతున్నారు.

తిండికోసం తిప్పలు

వరద ముంపులో చిక్కుకున్న బాధితులు తిండికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్​ చేసి సమాచారం ఇద్దామంటే  కరెంట్​ లేక ఫోన్లు స్విచ్​ ఆఫ్  అయ్యాయి.  సిబ్బంది ఎవరైనా వస్తారెమోనని ఎదురుచూసినా సమయానికి రాకపోవడంతో ఆకలితో జనం అలమటిస్తున్నారు. కనీసం మంచినీరు కూడా అందడం లేదు.  చిన్నపిల్లలకు పాలు కూడా సమయానికి అందడంలేదు. తమకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన  ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బాధితులు మండిపడ్డారు.

ఎవరు పట్టించుకుంటలేరు

అలీనగర్ లో మూడ్రోజులుగా 500 ఇండ్లలోకి నీరు వస్తోంది. కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్​రెడ్డి రాలేదు. ఇలాంటి టైంలో రాకపోతే ఇంకెప్పుడొస్తరు? నిత్యావసర సరుకుల కోసం ఇండ్లలో ఉన్న వారు పడరానిపాట్లు పడుతున్నరు.
– మహ్మద్​ సర్వర్​ఖాన్, అలీనగర్​ వాసి, హైదరాబాద్​

For More News..

అలర్ట్​ చేసింది లేదు..  ఆదుకున్నదీ లేదు