- డిండి లిఫ్ట్ స్కీంకు రూ.400 కోట్లు
- నాగార్జునసాగర్‌కు రూ.100 కోట్లు!
- రాష్ట్ర బడ్జెట్లో ఈ ఏడాదికి నిధుల కేటాయింపు
- గ్రీన్‌చానల్ ద్వారా ప్రతినెలా చెల్లింపులు
- ఒకట్రెండు నెలల్లో సొరంగమార్గం పనులు ప్రారంభం
- బ్రాహ్మణ వెల్లంల పనులు వేగవంతం
నల్గొండ, వెలుగు : రాష్ట్ర బడ్జెట్లో శ్రీశైలం సొరంగమార్గం ప్రాజెక్టుకు రూ.800 కోట్లు కేటాయించారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న సొరంగమార్గం, దానికి అనుసంధానంగా నార్కట్‌పల్లి మండలం బీవెల్లంల వద్ద నిర్మిస్తున్న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కలిపి రూ.800 కోట్లు కేటాయించినట్లు ఇరిగేషన్ ఆఫీసర్లు తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసేందుకు ప్రతినెలా గ్రీన్ చానల్ ద్వారా నిధులు రిలీజ్ చేస్తామని బడ్జెట్‌కు ముందు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు.
ఇందులో భాగంగా ఎస్ఎల్బీసీ, బీవెల్లంల కలిపి రూ.800 కోట్లు కేటాయించినట్టు తెలిసింది. ఈ నిధులతో ప్రాజెక్టు పనులు, భూసేకరణ, కాల్వల పనులు చేపట్టడం జరుగుతుంది. సొరంగమార్గ పనులు ఆగిపోయి చాలా కాలమైంది. మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్‌లో మెయిన్ బేరింగ్ రిపేర్ అయ్యింది. ఇక శ్రీశైలం, దోమలపెంట నుంచి వచ్చే సొరంగ మార్గంలో వరద నీరు భారీగా లీకవుతుంది. వరద నీటిని ఏదో విధంగా బయటకు తీసేందుకు అధికారులు కష్టపడుతున్నారు.
కానీ మన్నెవారిపల్లి వద్ద మెయిన్ బేరింగ్ అమెరికా నుంచి రావాల్సి ఉంది. ఆగస్టులో బేరింగ్ వస్తదని, దీన్ని బోర్ మిషన్‌కు బిగించడానికి రెండు నెలల టైం పట్టొచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నుంచి పనులు తిరిగి మొదలు పెడ్తామని అధికార వర్గాలు తెలిపారు.
బ్రాహ్మణ వెల్లంల పనులు వేగవంతం..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మానస పుత్రిక అయిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ఇక వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.674 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.427 కోట్ల పనులు పూర్తి చేశారు. 3,847 ఎకరాలకు 1522 ఎకరాల భూసేకరణ చేశారు. మరో 2,325 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణ పూర్తియితే 40 చెరువులు నింపే అవకాశం ఉంది.
డిండి లిఫ్ట్ స్కీంకు రూ.400 కోట్లు !
డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు రూ.400 కోట్లు కేటాయించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేందుకు ఇంకా రెండు వేల కోట్లు అవసరం. కాగా, వచ్చే మూడేళ్లలో పూర్తిచేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించినట్టు తెలిసింది. పది వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఐదు వేల కోట్ల పనులు పూర్తిచేశారు. ఇదిలావుండగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు మరమ్మతులకు ఇతర పనులకు కలిపి సుమారు రూ.100 కోట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు.
ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తిచేస్తాం
ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం నా బాధ్యత. నిధుల కేటాయింపులో ఎలాంటి సమస్య లేదు. పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఇప్పటికే కోదాడ, హుజూర్‌నగర్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు మొదలు పెట్టినం.
– ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి
మూడేళ్లలో డిండి స్కీం పూర్తి
బడ్జెట్లో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరాం. అధికారులతో రివ్యూ కూడా చేశాం. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10 వేల కోట్లు కాగా, ఇప్పటికే నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టారు. వచ్చే మూడేళ్లలో డిండి ప్రాజెక్టు కంప్లీట్ చేయడమే చాలెంజ్ గా తీసుకున్నా. కిష్టరాంపల్లి, శివన్నగూడెం కంప్లీట్అయితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మునుగోడు