ఒక్క ఐడియాతో సింగరేణికి ఏటా రూ. 800 కోట్లు మిగులు

ఒక్క ఐడియాతో సింగరేణికి ఏటా రూ. 800 కోట్లు మిగులు
  • రాష్ట్ర సర్కారు సంస్కరణలతో సత్ఫలితాలు
  • కేంద్ర ఏజెన్సీల నుంచి 11% వడ్డీతో 6 వేల కోట్ల అప్పు తెచ్చిన గత సర్కారు 
  • ఎస్​బీఐ నుంచి 7.25%, ఐసీఐసీఐ నుంచి 6.60 % 
  • వడ్డీకి లోన్లు ట్రాన్స్​ఫర్​ చేసిన ప్రస్తుత ప్రభుత్వం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర సర్కారు  సింగరేణిలో చేపడుతున్న పలు సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.  ముఖ్యంగా సింగరేణి సీఎండీ బలరాం నాయక్​ తీసుకున్న ఒక్క నిర్ణయంతో సంస్థకు ఏటా రూ.800 కోట్ల రుణభారం తగ్గింది. మంచిర్యాల జిల్లా జైపూర్​లో 1,200 మెగావాట్ల థర్మల్​ ప్లాంట్​ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్​ సర్కారు  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అడ్డగోలు వడ్డీకి లోన్లు తీసుకుంది. ఆ లోన్లను ప్రముఖ బ్యాంకులకు మళ్లించడం ద్వారా సింగరేణికి వడ్డీ భారం తగ్గడంతో పాటు సంస్థ క్రెడిబిలిటీ, క్రెడిట్​ స్కోర్, సంస్థ రేటింగ్ కూడా పెరగడం విశేషం. సంస్థ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే క్రమంలో బీఆర్ఎస్​ హయాంలో సంస్థ వివిధ కేంద్ర ఏజెన్సీల నుంచి  రూ.6 వేల కోట్లను11 శాతానికి పైగా వడ్డీకి తీసుకున్నట్టు సింగరేణి సీఎండీ బలరాం నాయక్​ గుర్తించారు.  

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రూరల్​ఎలక్ట్రిఫికేషన్​ కార్పొరేషన్​(ఆర్ఈసీ), పవర్ ​ఫైనాన్స్​ కార్పొరేషన్​( పీఎఫ్​సీ) నుంచి తీసుకున్న రుణాల్లో అప్పటికే రూ.2 వేల కోట్లు చెల్లించగా.. ఇంకా రూ.4 వేల కోట్లు రుణాలు ఉన్నాయి.  వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్ఈసీ, పీఎఫ్​సీ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేయగా, కేవలం ఒక శాతం మాత్రమే తగ్గించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో లోన్​ రీస్ట్రక్చరింగ్​ చేయాలని నిర్ణయించిన సీఎండీ.. ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయించారు. సింగరేణికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ఎస్​బీఐ బ్యాంకు  ముందుకు రాగా 7.25 శాతం వడ్డీతో రూ.3 వేల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు  నుంచి 6.60 శాతం వడ్డీతో  రూ.1,000 కోట్లు సమకూర్చుకొని.. ఆర్ఎఫ్​సీ, పీఎఫ్​సీకి సెటిల్​మెంట్​ చేశారు. ఈ నిర్ణయం వల్ల సింగరేణిపై వడ్డీ భారం గణనీయంగా తగ్గింది. ఫలితంగా సంస్థకు ఏటా రూ.800 కోట్ల వరకు మిగలనుంది.

క్రెడిట్​ రేట్​ కూడా పెరిగింది..

ఇటీవల సింగరేణిలో పలు సంస్కరణల వల్ల సంస్థకు క్రెడిట్​ రేట్​ గణనీయంగా పెరిగింది. గతంలో సింగరేణి రుణపరిమితి కేవలం రూ.133 కోట్లు మాత్రమే ఉండేది. దీంతో సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా సంస్థకు నిధుల సమీకరణ కష్టమయ్యేది. సంస్థ డిపాజిట్లు కూడా రూ.2 వేల కోట్లు మాత్రమే ఉండేవి. కొత్త సంస్కరణలతో డిపాజిట్లను గణనీయంగా పెంచగా.. రూ.6 వేల కోట్లకు చేరాయి.  గ్రాట్యుటీని సైతం రూ.1,200 కోట్ల నుంచి రూ.4వేల కోట్లకు పెంచారు. గతంలో తీసుకున్న రుణాలను వెంట వెంటనే చెల్లిస్తున్న  ఫలితంగా సింగరేణి సంస్థలకు క్రెడిట్​ రేట్​తో పాటు బ్యాంకుల్లో క్రెడిబిలిటీ పెరిగింది. 

ఫలితంగా గతంలో ఉన్న రూ.133 కోట్ల క్రెడిట్​ రేట్ ​నేడు రూ.4,650 కోట్లకు చేరింది. సింగరేణి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మార్గం సగమమైంది.  సింగరేణికి గతంలో ‘ఏఏ  మైనస్’​ రేటింగ్​ ఉండగా బలరాం నాయకత్వంలో తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా ‘ఏఏ ప్లస్’​గా మారింది. ఫలితంగా సింగరేణికి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోలార్​ పవర్ ​ప్లాంట్ల నిర్మాణం, కొత్త ప్రాజెక్టులు వేగం పుంజుకునే అవకాశముందని భావిస్తున్నారు.  సింగరేణికి తక్కువ వడ్డీతో రుణాలు రావడంతో సంస్థ నుంచి బొగ్గు కొనుగోలు చేసే జెన్​కో, కరెంటు కొనుగోలు చేసే డిస్కంలకు ఉత్పత్తి వ్యయం తగ్గి, యూనిట్​ కాస్ట్​ తగ్గే అవకాశముంది.