నా రికార్డు పదిలం.. ఎవరూ బ్రేక్ చేయలేరు: ముత్తయ్య మురళీధరన్

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (800) తీసిన బౌలర్‌గా తన పేరిట ఉన్న రికార్డు ఎప్పటికీ పదిలంగానే ఉంటుందని శ్రీలంక దిగ్గజ స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులోనూ తన రికార్డును అధిగమించే బౌలర్ వస్తారని తాను భావించడం లేదని వెల్లడించారు. శ్రీలంక మాంత్రికుడు అందుకు తగిన వివరణ కూడా ఇచ్చారు. 

టీ20లపై ఆసక్తి 

ప్రస్తుతం టీ20లదే రాజ్యం.. మూడు గంటల్లో ఫలితం తేలే పొట్టి ఫార్మాట్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. క్రికెటర్లూ అంతే.. పొట్టి ఫార్మాట్‌లపైనే దృష్టి సారిస్తున్నారు. ఇదే తన రికార్డు పదిలంగా ఉంటుందని చెప్పడానికి ప్రధాన కారణమని మురళీధరన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుత ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ ఎక్కువగా ఆడుతూ, టెస్టు క్రికెట్ తక్కువగా ఆడుతున్నారని శ్రీలంక దిగ్గజం పేర్కొన్నారు. ఇలా ఒక్క ఫార్మాట్‌పై శ్రద్ధ పెడితే తన రికార్డును బ్రేక్ చేయడం కష్టమని చెప్పుకొచ్చారు. 

"నేను టెస్ట్ క్రికెట్ గురించి ఆందోళన చెందుతున్నా. బహుశా ప్రతి దేశం ఏడాదిలో ఆరు లేదా ఏడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సవాల్‌గా తీసుకుని యాషెస్ సిరీస్‌ ఆడుతున్నాయి. ఈ సిరీస్‌కు ఆదరణ ఉండొచ్చు. కానీ, కొన్ని ఇతర దేశాల్లో ప్రజలు టెస్ట్ క్రికెట్ చూడటానికి ఇష్టపడట్లేదు. దాంతో టెస్టు మ్యాచ్‌లు ఆడటం తగ్గిపోతోంది. ఈ ఫార్మాట్‌లో నా 800 వికెట్ల రికార్డును మరొకరు అధిగమించడం కష్టం. ఎందుకంటే ఈ తరం క్రికెటర్లు పొట్టి ఫార్మాట్‌లో ఆడేందుకు ఇష్టపడుతున్నారు. మా తరంలో ఆటగాళ్లకు 20 ఏళ్ల కెరీర్‌ ఉండేది. ఇప్పుడు క్రికెటర్ల కెరీర్‌ బాగా తగ్గిపోయింది.." అని మురళీధరన్‌ మాట్లాడారు. 

లంక మాంత్రికుడి మాటల్లో వాస్తవం లేకపోలేదు. ఐపీఎల్ వంటి క్యాష్ రిచ్ లీగ్ కోసం కొందరు క్రికెటర్లు గాయాన్ని సాకుగా చూపి దేశానికి ఆడకుండా తప్పించుకుంటున్నారు. ఇక వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి దేశాల క్రికెటర్ల గురించి కథలు కథలుగా చెప్పవచ్చు. ఫ్రాంచైజీ టోర్నీలు ఉన్న సమయంలో దేశానికి ఆడబోమని బోర్డుకు నేరుగా తమ వైఖరిని తెలియజేస్తున్నారు. అందుకు కాదంటే సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నారు.  

టెస్టుల్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్లు

  • ముత్తయ్య మురళీధన్: 800 వికెట్లు
  • షేన్ వార్న్: 708 వికెట్లు 
  • జేమ్స్ అండర్సన్: 704 వికెట్లు 
  • అనిల్ కుంబ్లే: 619 వికెట్లు 
  • స్టువర్ట్ బ్రాడ్: 604 వికెట్లు

ప్రస్తుతం మురళీధరన్ రికార్డుకు దగ్గరగా ఉన్న బౌలర్లు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ (530 వికెట్లు), భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (516) మాత్రమే. అశ్విన్ వయసు 37 ఏళ్లు కాగా, లియోన్ వయసు 36 ఏళ్లు. వీరు మహా అంటే రెండు లేదా మూడేళ్లు. ఈ కాలంలో 800 వికెట్ల మార్కును చేరుకోవడం అసాధ్యం. అందువల్లే మురళీధరన్ అంత ధీమాగా చెప్తున్నారు.