ఇంజినీరింగ్​లో 81,490 మందికి సీట్లు

ఇంజినీరింగ్​లో 81,490 మందికి సీట్లు
  • సెకండ్ ఫేజ్ ఎప్ సెట్ సీట్ల కేటాయింపు 
  • కంప్యూటర్ సైన్స్ 98.12% సీట్ల భర్తీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రెండు ఫేజుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 86,509 సీట్లకు గాను 81,490 సీట్లు స్టూడెంట్లకు అలాటయ్యాయి. మరో 5,019 సీట్లు మిగిలాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటన వెల్లడించారు.

 రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, రెండు విడతల్లో కలిపి 94.20% సీట్లు నిండాయి. కాగా, రెండో విడతలో కొత్తగా 2,788 మందికి సీట్లు అలాట్ చేయగా, స్లైడింగ్ ద్వారా 22,848 మందికి సీట్లు కేటాయించారు. 

ఆప్షన్లు తక్కువగా పెట్టుకున్న 9,084 మందికి సీట్లు అలాట్ కాలేదు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 6,476 మందికి సీట్లు కేటాయించారు. 87 కాలేజీల్లో వంద శాతం సీట్లు అలాట్ కాగా, వీటిలో 80 ప్రైవేటు కాలేజీలున్నాయి.  సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 2లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఫస్ట్ ఫేజ్​లో కన్వీనర్ కోటా కింద78,694 సీట్లు అందుబాటులో ఉండగా, సెకండ్ ఫేజ్​లో కన్వీనర్ కోటాలో మరిన్ని సీట్లకు సర్కారు అనుమతి ఇవ్వడంతో 86 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 

కంప్యూటర్ సైన్స్​లో మిగిలింది 1,156 సీట్లే..

కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకు ఫుల్ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ  కోర్సుల్లో మొత్తంగా 61,329 సీట్లుండగా, 60,173 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. కేవలం 1,156 సీట్లే మిగిలాయి. సీఎస్ఈలో 388, సీఎస్ఎంలో 303 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్​లో 98.12 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ర్టానిక్స్ అండ్ ఎలక్ర్టికల్స్ లో 16,573 సీట్లకు 14,895 సీట్లు నిండాయి. సివిల్, మెకానికల్ దాని అనుబంధ కోర్సుల్లో 7,429 సీట్లకు 5,591 సీట్లు భర్తీ కాగా, ఇతర బ్రాంచుల్లో 1,178 సీట్లకు 831సీట్లు అలాట్ అయ్యాయి.