ఆయిల్ పామ్ సాగు కోసం.. లోహియా ఇండస్ట్రీస్​కు 82వేల ఎకరాలు

కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కేటాయించిన రాష్ట్ర సర్కార్
సాగు రైతులకు భారీ రాయితీలు
ఎకరాకు రూ.60వేల ఖర్చు, మూడేండ్ల తర్వాత పంట చేతికి


కరీంనగర్, వెలుగు: కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు, ప్రాసెసింగ్ కోసం లోహియా ఇండస్ట్రీస్​కు 82వేల ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జోన్​లో ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మెళకువలు నేర్పడం, నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి పనులు లోహియా గ్రూప్ చేపట్టనుంది. మూడేండ్ల కిందే సీఎం కేసీఆర్ రూ.4,800 కోట్లతో ఆయిల్ పామ్ క్రాప్ ఎక్స్​టెన్షన్​ ప్రాజెక్ట్​కు ఆమోదం తెలిపారు. మొదటి నాలుగేండ్లు ఒక్కో ఎకరానికి రూ.60వేల వరకు ఖర్చు వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. వివిధ రూపాల్లో 50శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 
లోహియా గ్రూప్​తో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 2024 – 2025 నాటికి 82వేల ఎకరాల్లో రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటి దాకా 8వేల ఎకరాల లక్ష్యాన్ని కూడా కంపెనీ చేరుకోలేదు. ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ప్రకటించినా రైతులు ముందుకు రావడం లేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13,163 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని అధికారులు టార్గెట్​గా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 8వేల ఎకరాల్లోపే డీడీలు కట్టినట్లు తెలిసింది. 
కరీంనగర్ జిల్లాల్లో అయితే 2వేలలోపు ఎకరాలకే డీడీలు పే చేశారు. ఆయిల్ పామ్ సాగు రైతులకు కొత్తకావడంతో కొంత ఆలస్యం అవుతున్నదని, అవగాహన కల్పించడం ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంచుతామని హార్టికల్చర్, వ్యవసాయ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల వసతి బాగానే ఉన్నా.. వరి సాగును 20 శాతం తగ్గించి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌‌ పామ్‌‌ను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వ తరఫున భారీగా రాయితీలు
మొక్కనాటిన మూడేండ్ల తర్వాత పంట చేతికి వస్తుందని వ్యవసాయ, హార్టికల్చర్ శాఖ అధికారు లు తెలిపారు. 30 ఏండ్ల దాకా దిగుబడి వస్తూనే ఉంటుందని వివరించారు. ప్రతి సీజన్​లో ఎకరాకు 10 టన్నుల పంట పండుతుందని, టన్ను ధర కనీ సం రూ.10వేల వరకు ఉంటుందని చెప్పారు. ఏటా దిగుబడి పెరుగుతుందని వివరించారు. అంత ర్ పంటగా కూడా సాగు చేసి లాభాలు పొందే అవకా శం ఉందని వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు జీఎస్టీ మినహాయించి వంద శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నట్లు తెలిపారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న బీసీ, ఓసీ రైతులకు 90 శాతం, 5 ఎకరాలు పైబడిన వారికి 80శాతం సబ్సిడీ అందజేస్తున్నదని వివరించారు. 
ఎరువులు, పురుగుల మందులు, నిర్వహణ ఖర్చు కోసం ప్రతి ఏటా ఎకరాకు రూ.2,100 చొప్పున నాలుగేండ్ల పాటు ప్రభుత్వం ఇస్తదని తెలిపారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.193 కాగా, రాయితీ కింద రూ.173 అందిస్తున్నదని వివరించారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేసే విధానాన్ని ది తెలంగాణ ఆయిల్ పామ్ (రెగ్యులరైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్) యాక్ట్ – 1993లో పొందుపరిచిందని తెలిపారు.