
- మన చరిత్రను కాపాడుకోవాలె
- ఆ బాధ్యత ఈ తరం చరిత్రకారులదే..
- మూలాలు దెబ్బతినకుండా వాస్తవ చరిత్రను అందించాలె
- రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ
- కేయూలో 82వ ‘ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్’ ప్రారంభం
- పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 1200 మంది చరిత్రకారులు
వరంగల్/హసన్‍పర్తి, వెలుగు: భారతదేశ ఘనమైన చరిత్ర వక్రీకరణకు గురవుతోందని..దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తరం చరిత్రకారులపై ఉందని న్యూఢిల్లీ జవహర్‍లాల్ నెహ్రూ యూనివర్సిటీ రిటైర్డ్ హిస్టరీ ప్రొఫెసర్ మృదులా ముఖర్జీ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గురువారం 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. ఈ కాన్ఫరెన్స్‌కు కేయూ వీసీ తాటికొండ రమేశ్ అధ్యక్షత వహించారు.
మొదటిరోజు కార్యక్రమంలో 1200 మంది ప్రతినిధులు పాల్గొనగా, 1030కి మించి పేపర్ సబ్మిషన్ చేశారు. మృదులా ముఖర్జీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చరిత్రపై సమగ్ర పరిశోధన జరపాలని, దేశ చారిత్రక మూలాలు దెబ్బతినకుండా వాస్తవ చరిత్రను భావితరాలకు అందించేందుకు నేటి చరిత్రకారులు కృషి చేయాలన్నారు. ‘జవహర్‍లాల్ నెహ్రూ ఇన్ అవర్ పాస్ట్, ప్రజెంట్అండ్ ఫ్యూచర్’ అన్న అంశంపై ప్రొఫెసర్ ఆదిత్య ముఖర్జీ మాట్లాడారు. జవహర్ లాల్ నెహ్రూ చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు.
నెహ్రూను దేశ ప్రజల మనస్సుల నుంచి చెరిపివేసేలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలోని అత్యంత విశిష్ట వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరన్నారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎస్‍ఏ నదీమ్ రిజ్వీ మాట్లాడుతూ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఇండియన్ కాంగ్రెస్ పోరాడిందన్నారు. వీసీ తాటికొండ రమేశ్ మాట్లాడుతూ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు కేయూలో 30 ఏండ్ల క్రితం మొదటిసారి నిర్వహించారని, తన హయాంలో మరోసారి అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏడుగురు రాసిన ఉత్తమ పుస్తకాలకు, 10 ఉత్తమ పత్రాలకు అవార్డులు, నగదు బహుమతులు ప్రకటించారు. ఈ సదస్సు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.
కాకతీయ..కలర్‍ఫుల్
సదస్సుకు దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన హిస్టరీ, టూరిజం స్టూడెంట్లు తమ సంప్రదాయం ఉట్టిపడేలా కట్టుబొట్టుతో రావడంతో కాకతీయ యూనివర్సిటీకి కొత్త కళ వచ్చింది. వీరేగాక ఇతర దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఉజ్జెకిస్థాన్ నుంచి మహమ్ముద్ అహ్మద్, యూఎస్ఏ నుంచి రీతు కందూరి వచ్చారు. ఓరుగల్లుకు గొప్ప చారిత్రాత్మక ప్రాంతంగా పేరుండడంతో ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు నగరంలోని వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం వంటి ప్రదేశాలను చూడడానికి ఆసక్తి చూపారు. యూనివర్సిటీ అధికారులు సదస్సుకు వచ్చిన వివిధ రాష్ట్రాల స్టూడెంట్ల అభిరుచులకు అనుగుణంగా వంటకాలు చేయించారు. జిల్లా టూరిజం అధికారులు ఉమ్మడి జిల్లాలోని చారిత్రక, టూరిస్ట్ ప్లేస్‌లను చూపించారు.