ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 83.28 శాతం నమోదు కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78.66 శాతం నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లను ఓటింగ్ కు అనుమతించడంతో రాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం నుంచే చలిని కూడా లెక్క చేయకుండా జనం ఓటింగ్ లో పాల్గొన్నారు.
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలోని పోలింగ్ స్టేషన్ లో దాదాపు ఎనిమిది పోలింగ్ బూత్ లను ఏర్పాటుచేయగా, కొన్ని వీల్ చైర్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడ్డారు. ప్రైవేట్ ఆటోల్లో వచ్చిన వారిని కుటుంబ సభ్యులు సపోర్టుగా ఉంటూ నడిపించుకుంటూ ఓటింగ్ కు తీసుకెళ్లడం కనిపించింది. ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరుగుతున్న తీరును వెబ్ క్యాస్టింగ్ ద్వారా కొత్త కలెక్టరేట్ నుంచే జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్, సీపీ విష్ణు వారియర్ పరిశీలించారు.
ఖమ్మం నగరంతో పాటు పలు కేంద్రాలను పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక అభ్యర్థులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పలు కేంద్రాలను సందర్శించి, ఓటింగ్ సరళిని పరిశీలించారు. కాగా ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా మహిళా ఓటర్లు బారులు తీరి కనిపించారు. అన్ని నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక పలు పోలింగ్ కేంద్రాలకు సమీపంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు హడావుడి చేశారు. పార్టీల జెండాలతో ప్రచారం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమైనా, వాటిని అతిక్రమించడంతో పోలీసులు జోక్యం చేసుకొని తొలగించారు.
ఓటు వేసేందుకు వచ్చామనే సాకుతో క్యూలైన్లలో కూడా కొందరు నాయకులు తమ పార్టీ అభ్యర్థికే ఓటేయాలంటూ ప్రచారం చేశారు. ఇక కొత్తగూడెం పట్టణంలోని పాత కొత్తగూడెం , చుంచుపల్లి గవర్నమెంట్ హై స్కూల్, లక్ష్మీదేవి పల్లి లోని రామచంద్ర డిగ్రీ కాలేజీలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వచ్చేసరికి, తమ ఓట్లు పోలింగ్ కావడంపై పలువురు ఓటర్లు ఆఫీసర్లపై మండిపడ్డారు. రామచంద్ర డిగ్రీ కాలేజీ లోని పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి జలగం వెంకట్రావు ఎన్నికల అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.