సింగరేణి పరీక్షలకు 84 శాతం హాజరు :సీఎండీ బలరామ్

సింగరేణి పరీక్షలకు 84 శాతం హాజరు :సీఎండీ బలరామ్

హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి మంగళ, బుధవారాల్లో నిర్వహించిన పరీక్షలకు 84% మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో 32 సెంటర్లలో ఎగ్జామ్స్​ నిర్వహించగా.. 29,291  మంది హాజరైనట్టు సంస్థ సీఎండీ బలరామ్​ వెల్లడించారు. మేనేజ్​మెంట్ ట్రెయినీ(ఈఅండ్ఎం) -42 పోస్టులకు, మేనేజ్​మెంట్ ట్రెయినీ (సిస్టమ్స్) 7 పోస్టులకు, జేఎంఈటీ-100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రెయినీ(మెకానికల్)- 9, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రెయినీ(ఎలక్ట్రికల్) -24, ఫిట్టర్ ట్రెయినీ -47, ఎలక్ట్రిషియన్ ట్రెయినీ- 98 పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. 

వారం రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేస్తామని, కీపై అభ్యంతరాలుంటే స్వీకరించేందుకు గడువు ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా ఫలితాలు రిలీజ్​ చేస్తామని తెలిపారు. కంప్యూటర్​ బేస్డ్​ పరీక్ష పారదర్శకంగా నిర్వహించామని, బయోమెట్రిక్,  ఐరిష్ ద్వారా అభ్యర్థుల వివరాలు నమోదు చేశామని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, హైదరాబాద్​లోని కంట్రోల్ రూం ద్వారా పరీక్షల నిర్వహణను పరిశీలించినట్టు తెలిపారు. 

గత నెల 20, 21 తేదీల్లో 272 పోస్టులకు, తాజాగా 327 పోస్టులకు పరీక్షలు నిర్వహించడంతో 599 ఎక్స్ టర్నల్ పోస్టుల భర్తీకి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని మోసగాళ్లు మాయ మాటలు చెప్తే నమ్మి మోసపోవొద్దని సూచించారు.