డ్రంకెన్ డ్రైవ్​లో దొరికిన వాళ్లలో 85 శాతం యువతే

డ్రంకెన్ డ్రైవ్​లో దొరికిన వాళ్లలో 85 శాతం యువతే

 

  • 11 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్​లో 81వేల కేసులు
  • రూ.15.93 కోట్ల జరిమానా వసూలు
  • 1,619 మందిడ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్
  • బ్లడ్​లో ఆల్కహాల్ పర్సంటేజ్​ను బట్టి శిక్షలు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా డ్రంకెన్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్​లు రద్దు చేసినా మార్పు రావడం లేదు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ ఏడాది 11 నెలల వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో 81,230 కేసులు నమోదయ్యాయి. కోర్టులు రూ.15.92 కోట్ల జరిమానాలు విధించాయి. 1,619 మంది డ్రైవింగ్ లైసెన్స్​లను పోలీసులు సస్పెండ్ చేశారు. తనిఖీల్లో పట్టుబడిన వారిలో బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఆధారంగా కేసు రిజిస్టర్ చేస్తున్నారు. 

సిటీలోని పబ్స్, బార్లలో పార్టీలు

డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారిలో 18 నుంచి 35 ఏండ్ల వయస్సున్న వాళ్లే 85 శాతం మంది ఉన్నట్లు పోలీసుల లెక్కల్లో తేలింది. వీరిలో కాలేజ్ స్టూడెంట్స్, ఐటీ, ప్రైవేట్‌‌‌‌ ఎంప్లాయీస్, డాక్టర్స్‌‌‌‌, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీకెండ్స్‌‌‌‌లో లిక్కర్ పార్టీలకు యువత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నది. హైదరాబాద్ సిటీలోని పబ్స్, బార్లతో పాటు శివారు ప్రాంతాల్లోని ఫామ్​హౌస్​లలో అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్స్ ఉంటాయనే భయంతో రాత్రి ఒంటి గంట తర్వాత ఇండ్లకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిద్ర లేకపోవడం, మద్యం తాగి ఉండటమే యాక్సిడెంట్లకు కారణమని పోలీసులు చెప్తున్నారు. ఈ ఏడాది పట్టుబడిన వారిలో 6,800 మందికి 200 ఎమ్‌‌‌‌జీ కంటే ఎక్కువగా మద్యం మోతాదు రికార్డ్‌‌‌‌ అయ్యింది.

ALSO READ : స్కూల్, కాలేజీల బస్సుల్లో సగానికి పైగా అన్​ఫిట్

ర్యాండమ్​గా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు

పోలీసులు ర్యాండమ్​గా డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. హైవేలు, టోల్​గేట్స్, జంక్షన్ కనెక్టివిటీ లేని రోడ్లపై స్పెషల్ డ్రైవ్స్ చేపడ్తున్నారు. సాయంత్రం 3 గంటల నుంచే చెకింగ్స్ ప్రారంభిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే.. ట్రాఫిక్ రద్దీలేని టైమ్​లో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ఓఆర్ఆర్ సహా ప్రతి ట్రాఫిక్ పీఎస్ పరిధిలోనూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ర్యాండమ్ గా చెకింగ్ చేపడ్తున్నారు. ప్రతి రోజూ ఒకేచోట కాకుండా.. చెకింగ్ పాయింట్లు మారుస్తున్నారు. సిటీలో పబ్స్, బార్లకు దగ్గర్లోనే చెక్ పాయింట్లు పెడ్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు తరుచూ తనిఖీలు చేపడ్తున్నారు.
 
ఆధారాలతో సహా చార్జ్​షీట్ దాఖలు

బ్రీత్ అనలైజర్ టెస్టులో పట్టుబడిన వారి బ్లడ్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ కౌంట్ చేస్తారు. 100 మిల్లీ లీటర్ల బ్లడ్​లో 30 మిల్లీ గ్రాములు.. అంతకంటే ఎక్కువ బీఏసీ వస్తే వారిపై కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఆధారాలతో సహా కోర్టులో చార్జ్​షీట్ దాఖలు చేస్తున్నారు. ప్రతి ఏటా అత్యధిక కేసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తర్వాత సైబరాబాద్, ఆ తర్వాత రాచకొండ పరిధిలో నమోదవుతున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జీలు వారి విచక్షణాధికారానికి అనుగుణంగా శిక్షలు విధిస్తున్నారు. మొదటి సారి పట్టుబడితే జరిమానా విధించి హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు బీఏసీ లెవల్స్​ను బట్టి శిక్షలు, జరిమానా విధిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే జైలు శిక్ష విధిస్తున్నారు. రూ.2,000 నుంచి అత్యధికంగా రూ.10,500 వరకు జరిమానా వేస్తున్నారు. దీంతో పాటు సోషల్ సర్వీస్, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్, క్యాన్సిల్ లాంటి శిక్షలు విధిస్తున్నారు.