పాలమూరు జిల్లాలో బడి బస్సులు భద్రమేనా?

పాలమూరు జిల్లాలో బడి బస్సులు భద్రమేనా?

వనపర్తి, వెలుగు: బడులు రీ ఓపెన్​ అయినా ప్రైవేట్​ స్కూల్​ యాజమాన్యాలు బడి బస్సులను ఫిట్​నెస్​ చేయించుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. బడి బస్సుల ఫిట్​నెస్​ సక్రమంగా ఉంటేనే పిల్లలు స్కూల్​కు క్షేమంగా వెళ్లి రాగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఫిట్​నెస్​ సరిగా లేని బస్సులు మొరాయించడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏడాది స్కూల్​ బస్సులను ఫిట్​నెస్​ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్​ ఉండదని ఆర్టీఏ ఆఫీసర్లు చెబుతున్నారు. 

 నెల ముందు నుంచే..​

స్కూళ్లు రీ ఓపెనింగ్​కు నెల రోజుల ముందు నుంచే ప్రైవేట్​ స్కూల్స్​ మేనేజ్​మెంట్లు తమ స్కూల్​ బస్సులను ఫిట్​నెస్​ చేయించుకోవాలి. అన్ని సక్రమంగా ఉన్నాయని, బస్సులు నడిపేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆర్టీఏ ఆఫీస్​ నుంచి సర్టిఫికెట్​ పొందాలి. కానీ, ఇంకా 40 శాతం వరకు బస్సులు ఫిట్​నెస్​ చేయించుకోలేదు. ఫిట్​నెస్​ విషయంలో మేనేజ్​మెంట్లు నిర్లక్ష్యం చూపుతున్నాయనే విమర్శలున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో ఇలా..

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో 1,202 స్కూల్​ బస్సులు ఉన్నాయి. ఇందులో 211 బస్సులకు మాత్రమే ఫిట్ నెస్​ పరీక్షలు చేయించినట్లు ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. వనపర్తి జిల్లాలో 166 బస్సులు ఉండగా, 110 బస్సులకు ఫిట్​నెస్​ పరీక్షలు చేయించాల్సి ఉంది. నారాయణపేట జిల్లాలో 128 బస్సులు, వనపర్తిలో 166, జోగులాంబ గద్వాలలో 244, మహబూబ్​నగర్​లో 439 బస్సులు ఉండగా, 850 బస్సులు ఫిట్​నెస్​ పరీక్షలు చేయించుకోవాల్సి ఉందంటే పరిస్థితి 
ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఆటోలపై చర్యలేవీ?

స్కూల్​ బస్సుల ఫీజు ఎక్కువగా ఉండడంతో పాటు వివిధ కారణాలతో పేరెంట్స్​ తమ పిల్లలను ఆటోల్లో స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇదిలాఉంటే ఆటో వాలాలు ఫిట్​నెస్​ పరీక్షలు చేయించుకోకపోవడం, ఒక్కో ఆటోలో 10 మందికి పైగా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. స్టూడెంట్ల బ్యాగులను ఆటోపై లేదంటే సైడ్​లకు వేలాడదీస్తూ ప్రమాదకరంగా స్టూడెంట్లను తీసుకెళ్తున్నారు. దీంతో పేరెంట్స్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలకు కూడా ఫిట్​నెస్​ తప్పనిసరి చేయడంతో పాటు పరిమితికి మించి విద్యార్థులను తరలించకుండా చూడాలని కోరుతున్నారు.

ఫిట్​నెస్​ లేకుంటే సీజ్​ చేస్తాం..

జిల్లాలోని అన్ని స్కూల్​ బస్సులను ఫిట్​నెస్​ పరీక్షలు చేయించుకుని నడపాలి. ఫిట్​నెస్​ లేకుండా నడిపితే ఆ బస్సులను సీజ్​ చేస్తాం. ఇప్పటికే ఒక స్కూల్​ బస్​ సీజ్​ చేశాం. ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లవద్దు. 

మానస, డీటీవో