ఆపరేషన్​ చేయూత..86 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఆపరేషన్​ చేయూత..86 మంది మావోయిస్టుల లొంగుబాటు
  • వీరిలో ఎక్కువ మంది కొత్తగూడెం, ములుగు జిల్లాల వాళ్లే
  • లొంగిపోయిన వారిలో 27 మంది మిలీషియా సభ్యులు
  • వివరాలు వెల్లడించిన ఐజీపీ చంద్రశేఖర్​రెడ్డి 
  • ఫలితాలిస్తున్న ‘ఆపరేషన్​ చేయూత’

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట శనివారం 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొత్తగూడెంలోని హేమచంద్రాపురం పోలీస్​ హెడ్​ క్వార్టర్​లో మల్టీ జోన్–1 ఐజీపీ చంద్రశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్​ రాజు మీడియాకు వివరాలను వెల్లడించారు. పోలీసులు చేపట్టిన ఆపరేషన్​ చేయూత మంచి ఫలితాలు ఇస్తున్నదని చెప్పారు. 

లొంగిపోయిన వారిలో కొత్తగూడెం, ములుగు జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారన్నారు. నలుగురు ఏసీఎం స్థాయి, పార్టీ మెంబర్స్​ ఐదుగురు, 27 మంది మిలీషియా సభ్యులతో పాటు పలు శాఖలకు చెందిన వారు లొంగిపోయిన వారిలో ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కలిపి 224  మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. 

ప్రజల్లో మావోయిస్టులకు ఆదరణ లేదని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావాలన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. మీడియా సమావేశంలో సీఆర్పీఎఫ్​ ఆఫీసర్లు, పోలీస్​ అధికారులు పాల్గొన్నారు.