తమిళనాడులో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 86 శాతం అసింప్టమేటిక్ (లక్షణాలు లేనివే) అని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి చెప్పారు. లాక్ డౌన్, కరోనా కట్టడికి అమలు చేసిన చర్యల వల్ల వైరస్ వ్యాప్తిని చాలా వరకు తగ్గించగలిగామని అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశంలోకి కరోనా వైరస్ జనవరి చివరిలో వస్తే.. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచే నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. శనివారం రాత్రి వరకు 30,152 కరోనా కేసులు నమోదు కాగా, 251 మంది మరణించారని, 16 వేల మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని సీఎం పళనిస్వామి చెప్పారు. దేశంలోనే అత్యధిక రికవరీ రేటు ఉన్న రాష్ట్రం తమిళనాడు అని, మరణాల రేటులో ప్రపంచం మొత్తంలోనే తమ రాష్ట్రంలో తక్కువని అన్నారు. రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు చేస్తున్నామని, జూన్ 4 వరకు 5.5 లక్షల పరీక్షలు చేశామని చెప్పారాయన. ఈ టెస్టుల ద్వారా అత్యధికంగా 86 శాతం కరోనా పాజిటివ్ కేసులు ఎటువంటి లక్షణాలు లేని వారిలోనే గుర్తించామని తెలిపారు.
86% of #COVID19 cases in the state are asymptomatic. We have the highest recovery rate in India and the lowest mortality rate in the world: Tamil Nadu Chief Minister Edappadi K. Palaniswami pic.twitter.com/8QBYCRCMcu
— ANI (@ANI) June 7, 2020