పంచాయతీరాజ్ అధికారుల తప్పిదం
860 ఎకరాలు గెజిట్లో ఎక్కలే
వికారాబాద్ జిల్లా, వెలుగు: పంచాయతీరాజ్ అధికారుల తప్పిదం కారణంగా 860 ఎకరాల వ్యవసాయ భూమి గెజిట్లో నమోదు కాలేదు. దీనిపై పలుమార్లు డీపీవోకు విన్నవించినా పట్టించుకోలేదు. 3 ఏళ్లుగా మైతాప్ ఖాన్ గూడ రైతులకు రైతుబంధు రావడం లేదు. చివరకు బుధవారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. నవాబుపేట మండలంలోని ఎల్లకొండ పంచాయతీలో అనుబంధ గ్రామంగా మైతాప్ ఖాన్ గూడ ఉండేది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త పంచాయతీగా గ్రామాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ అధికారులు పంచాయతీకి సరిహద్దులు ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన1005 ఎకరాల వ్యవసాయ భూమిని మ్యాప్ ఎక్కించారు. సర్వే నెంబర్లు 372 –378 వరకు168 ఎకరాలు, 378 –412 వరకు 860 ఎకరాల వ్యవసాయ భూమిని రెవెన్యూ శాఖకు కేటాయించి జిల్లా పంచాయతీరాజ్ అధికారులకు అందజేశారు. కానీ అన్నిశాఖల అధికారులు కేటాయించిన 168 ఎకరాలను మాత్రమే పంచాయతీరాజ్ అధికారి ఆఫీసు నుంచి గెజిట్ కు పంపించారు. మిగిలిన సర్వే నంబర్లలో 860 ఎకరాల వ్యవసాయ భూమి పంపలేదు. మూడేళ్లుగా రైతు బంధు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే చేయడానికి వెళితే ఎల్లకొండ సర్పంచ్ భూములు వారి పరిధిలో ఉన్నాయని అడ్డుపడుతున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నివేదిస్తామని, గ్రామానికి న్యాయం జరిగేలా చూస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.
For More News..