
మెదక్, వెలుగు: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో రూ.8.65 లక్షలు పట్టుబడ్డాయి. హవేలీ ఘనపూర్ వద్ద వాహనాల తనిఖీలో సరైన పత్రాలు లేని రూ.5.83 లక్షల నగదును సీజ్చేసినట్లు ఎస్ఐ ఆనంద్ గౌడ్ తెలిపారు. మండలంలోని బోగుడ భూపతిపూర్ గ్రామంలో విల్ కార్డ్ హాల్ సెల్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగులు డబ్బులు తీసుకెళ్తున్నారు.
వారివద్ద డబ్బులకు సంబంధించి రశీదులు లేనందున స్వాధీనం చేసుకుని కలెక్టరేట్లో డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. సరైన పత్రాలు సమర్పించి తిరిగి తీసుకెళ్లవచ్చన్నారు. పెద్దశంకరంపేట మండలం కోలపల్లి టోల్ గేట్ దగ్గర శంకరపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వెహికిల్ను పోలీసులు ఆపి తనిఖీ చేయగా అందులో రూ.2.20 లక్షలు దొరికాయి. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో బైక్ పై వెళుతున్న డ్రం కంపెనీలో పనిచేస్తున్న సూపర్ వైజర్ నితిన్ కుమార్ వద్ద ఎలాంటి పత్రాలు లేని రూ.70 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కరుణాకర్ తెలిపారు.