మల్లారెడ్డి నమ్మించి గొంతు కోసిండు

  • భూమి రిజిస్ట్రేషన్ చేసుకొని పైసలు ఇయ్యట్లేదు
  • రూ.14 కోట్ల చెక్కులు బౌన్స్ అయ్యినయ్
  • గోడును వెళ్లబోసుకున్న 87 ఏండ్ల వృద్ధ రైతు

బషీర్ బాగ్, వెలుగు : దగ్గరి చుట్టమే కదా అని నమ్మితే మాజీ మంత్రి మల్లారెడ్డి తనను నమ్మించి గొంతు కోసిండని దోమలగూడకు చెందిన 87 ఏండ్ల వృద్ధ రైతు కళ్లెం నర్సింహా రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నాడు. మల్లారెడ్డి నుంచి తనకు రావాల్సిన పైసలను ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గురువారం ఆయన మాట్లాడాడు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట మండలంలోని యాడారంలో సర్వే నంబర్ 249, 250లో తనకు 23.26 ఎకరాల భూమి ఉందన్నాడు. అందులో 9.29 ఎకరాలను రూ.21.88 కోట్లకు కొనేందుకు మల్లారెడ్డి తనతో ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పాడు. అనంతరం విడతల వారీగా రూ.8.03 కోట్లు చెల్లించినట్లు వివరించాడు. మిగతా రూ.14 కోట్లు తర్వాత ఇస్తానని నమ్మించి

భూమిని సీఎంఆర్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుపై మల్లారెడ్డి జూన్​లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపాడు. ఆ తర్వాత మిగిలిన రూ.14 కోట్లకు చెక్కులు ఇవ్వగా, అవి బౌన్స్ అయినట్లు చెప్పాడు. 40 రోజులుగా ఆ డబ్బులు అడిగితే మల్లారెడ్డి స్పందించడం లేదన్నారు. ఆ డబ్బులు ఎలాగైనా తనకు ఇప్పించేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.