87 వేల వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎన్నిక‌ల ప్ర‌చారం.

మ‌రికొన్ని రోజుల్లో దేశంలో తొలి విడ‌త ఎన్నిక‌ల ప్రారంభం కానున్నాయి. ఎన్నిక‌ల‌కు మ‌రింత స‌మ‌యం లేక‌పోవ‌డంతో ప‌లు పార్టీలకు చెందిన రాజకీయ నాయ‌కులంతా త‌మ ప్ర‌చారాన్ని వీలైనంత త్వ‌రగా ప్ర‌జ‌ల్లోకి చేరేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఓ వైపు ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల‌ను అభ్య‌ర్ధిస్తూనే మ‌రో వైపు అవ‌కాశ‌మున్న సోష‌ల్ మీడియాలో కూడా త‌మ ప్ర‌చార ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌లు అత్యధికంగా వినియోగిస్తున్న సోషల్ మీడియా మెసేజింగ్ యాప్.. వాట్సాప్ ద్వారా త‌మ సందేశాల‌ను పంపించేందుకు య‌త్నిస్తున్నారు.

వాట్సాప్ గ‌ణాంకాల ప్ర‌కారం ప్రస్తుతం దేశంలో 20 కోట్ల మంది వాట్సాప్‌ను వినియోగిస్తున్నట్టు స‌మాచారం. వీరంద‌రిని ప్రభావితం చేసేందుకు దేశవ్యాప్తంగా దాదాపు 87 వేల వాట్సాప్ గ్రూపులతో రాజ‌కీయ నాయ‌కులు సిద్ధంగా ఉన్నట్లు తేలింది. అయితే ప్రస్తుతం దేశంలో 43 కోట్ల మంది దగ్గర స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయని, వీళ్లందరూ వాట్సాప్ వాడుతుండటంతో ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండే అవకాశం ఉన్నదని హాంకాంగ్‌కు చెందిన కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారం కోసం ఫేస్‌బుక్‌ను వాడిన వారు.. ఇప్పుడు దాని స్థానంలో వాట్సాప్‌ను వాడుతున్నట్లు ఈ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు.

రిలయన్స్ జియోతో, డేటా అతి చౌకగా ల‌భిస్తున్న నేప‌థ్యంలో రాజకీయ పార్టీలు త‌మ స‌భ‌లు, స‌మావేశాల‌ను.. జ‌నాల‌కు చేరువయ్యేలా ఫేస్ బుక్ మరియు యూట్యూబ్ ల‌లో ప్ర‌త్య‌క్ష‌ ప్రసారం చేస్తున్నాయి. వీటితో పాటుగా వాట్సాప్‌ను కూడా త‌న ప్ర‌చారానికి వాడుకుంటూ ఓట‌ర్ల‌కు చేరువ‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ క్రమంలో న‌కిలీ వార్త‌లు కూడా ప్ర‌జ‌ల‌కు చేరే ప్రమాదం ఉన్నదని సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్ అనూప్ మిశ్రా అన్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూపులో అత్యధికంగా 256 మంది స‌భ్యులు ఉంటార‌ని.. ఈ లెక్కన 87 వేల గ్రూపుల‌కి… మొత్తంగా 2.2 కోట్ల మందికి వాట్సాప్ మెసేజ్‌లు వెళ్తాయ‌ని ఆయ‌న‌ అన్నారు. ఈ నకిలీ వార్తలను అరికట్టేందుకు వాట్సాప్‌ అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. TV, రేడియో మరియు డిజిటల్ వేదికలపై నకిలీ వార్తల ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేప‌డుతోంది. మ‌రోవైపు ఎన్నిక‌ల సంఘం కూడా వాట్సాప్‌తో సహా ఇతర సోషల్ మీడియా సంస్థలపై నిఘా వేసి ఉంచింది.