ఫోన్ పోయిందా..నో వర్రీస్..పోలీసులు ఇట్టే పట్టేస్తారు

ఫోన్ పోయిందా..నో వర్రీస్..పోలీసులు ఇట్టే పట్టేస్తారు

మొబైల్‌ మిస్సయిందా..? బస్సులో కూర్చున్న వ్యక్తి చోరీ చేశాడా..? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్లను  పోలీసుశాఖ ట్రాక్‌ చేసి.. దేశంలో ఎక్కడ ఉన్నా వాటిని రూపాయి ఖర్చులేకుండా తీసుకొచ్చి బాధితులకు అందజేస్తోంది. ఇందుకోసం టెక్నికల్‌ అనాలసిస్‌ వింగ్‌ (టీఏడబ్ల్యూ) పేరిట ఓ ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది.  

నంద్యాల జిల్లాలో 847 ఫోన్లు రికవరీ

ఎవరైనా పొరపాటున మొబైల్ పొగొట్టుకుంటే తిరిగి దొరుకుతుందా... ఇక ఆ ఫోన్‌పై ఆశ వదిలేసుకోవడమేనా.. ఇకపై నో టెన్షన్.. మొబైల్‌ ఈజీగా పట్టుకోవచ్చు అంటున్నారు నంద్యాల జిల్లా పోలీసులు. జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం నిర్వహించారు. మొబైల్ పోయిందని ఫిర్యాదు అందిన నెలరోజుల్లోగా ఎలాంటి రుసుము వసూలు చేయకుండానే ఫోన్‌ రికవరీ చేసి  బాధితులకు అప్పగిస్తామని నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు. మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానంతో 847 సెల్ ఫోన్లను నంద్యాల జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఏపీ డీజీపీ కేవీ  రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాలతో కర్నూలు రేంజ్ DIG S.సెంథిల్ కుమార్ పర్యవేక్షణలో నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి  ఆధ్వర్యంలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్స్‌ రికవరీ చేయడంలో టీఏడబ్ల్యూ బృందం ఇప్పటికే పలు రివార్డులు, అవార్డులు అందుకుంది.  ఈ కార్యక్రమంలో నంద్యాల  జిల్లా ఎస్పీతో పాటు  అడిషనల్ ఎస్పీ R.రమణ, నంద్యాల టౌన్ DSP సి .మహేశ్వర్ రెడ్డి , DCRB INSPECTOR జయరాములు, DCRB SI అశోక్, ఎస్‌పి సి‌సి నాగరాజు,టౌన్ సిఐ లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. మహారాష్ట్ర,తమిళనాడు , కర్ణాటక,గోవా,తెలంగాణా మొదలగు రాష్ట్రాలతో పాటు  ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూల్, కడప, అనంతపురం జిల్లాలలో  ఈ మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.. వీటి విలువ సుమారు 1,52,98,029 రూపాయలు ఉంటుందని నంద్యాల జిల్లా ఎస్పీ తెలిపారు.

మొబైల్ ఫోన్ పోతే   9121101107 అనే నెంబర్ కు HAI అని SMSచేస్తే  ఒక లింక్ వస్తుంది ఆ లింకును క్లిక్ చేసి  పోయిన సెల్ ఫోన్   వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తామని నంద్యాల జిల్లా ఎస్పీ తెలిపారు. 


మీ సేవ నందు ఎలా అప్లై చేయాలి

మొబైల్ పోయిన  బాధితులు  దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రింది వివరాలను  ఇవ్వవలిసి ఉంటుంది. మీరు పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ వివరాలు, మీరు పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్ యొక్క IMEI వివరాలు, మీరు పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన మొబైల్ నంబర్ వివరాలు. మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్ , చిరునామా ,పేరు మొదలగు వివరాలు మిమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నెంబర్ మరియు alternate కాంటాక్ట్ వివరాలు వంటి  వివరాలు మీరు మీ-సేవా నందు సమర్పించి Missing /lost articles రుసుమును చెల్లించి , మీ-సేవా రసీదును సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని పోలీసులు సూచించారు.

ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసి మొబైల్ LOST కాలమ్ నందు ఈ క్రింది వివరాలను నమోదు చేయాలి. మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి ,మీ మొబైలు కు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు , మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్ మిట్ చేయాలి. ఈ విధంగా మీరు ఫిర్యాదు చేస్తే పోలీస్ వారు మీ మొబైలును రికవరీ చేసి ఇస్తామన్నారు.

సెల్‌ఫోన్‌ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్‌ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్‌ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల రికవరీపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్‌ మొబైల్‌ ట్రాకింగ్‌ సిస్టం (ఎంఎంటీఎస్‌) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు.

సెల్‌ఫోన్‌ రికవరీలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి

నిత్యం ఎక్కడో ఓ చోట్ల మొబైల్‌ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. మరికొన్నిసార్లు ఫోన్లు పోగొట్టుకుంటారు. ఇలాంటి మొబైల్స్‌ ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి..? ఎక్కడ ఉన్నాయి..? పోగొట్టుకున్న ఫోన్‌ ఎవరు వాడుతున్నారు..? అనే వివరాలను ఛేదించడానికి  పోలీసు శాఖలో టీఏడబ్ల్యూ విభాగం పనిచేస్తోంది. ఇటీవల ఫోన్‌ చోరీ కేసులు పెరిగాయి. ఏదో ఒక చోట తరచూ మొబైల్‌ ఫోన్లు కనిపించకుండా పోతున్నాయి. పోలీస్‌ స్టేషన్లకు ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండడంతో ఈ కేసులు ఛేదించడం తొలుత పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను కనిపెడుతూ మాయమైన ఫోన్లను ఇట్టే పట్టేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి పట్టుబడితే వారిని పోలీసులు కటకటాలపాలు చేస్తున్నారు.