8 నెలలు.. 88 వేల కోట్లు.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు

8 నెలలు.. 88 వేల కోట్లు.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు
  • టీజీ ఐపాస్ ద్వారా 1,764 సంస్థలకు అనుమతులు
  • రూ.16,672 కోట్ల పెట్టుబడులు.. 47,974 మందికి ఉపాధి అవకాశాలు
  • సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో రూ.40 వేల కోట్లు
  • అమెరికా, దక్షిణ కొరియా టూర్​తో రూ.30 వేల కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికెషన్ (టీజీ ఐపాస్) లో అనుమతులు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్, ఇటీవలి అమెరికా, దక్షిణకొరియా పర్యటనల ద్వారా రూ.88,432 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే కొత్తగా 1,13,724 కొలువులు లభించేలా రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టేందుకు సంస్థలు ముందుకొచ్చాయి. ఐటీ, ఫార్మా, బయోటెక్, పవర్, టెక్స్​టైల్స్ రంగాలకు చెందిన సంస్థలు ఇన్వెస్ట్​మెంట్స్​కు ముందుకు వచ్చాయి.

టీజీ ఐపాస్​ ద్వారా భారీగా అనుమతులు

టీజీ ఐపాస్ ద్వారా భారీగా అనుమతులను ఇచ్చారు. నిరుడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1,764 సంస్థలకు టీజీ ఐపాస్ ద్వారా అనుమతులు లభించాయి. వాటి ద్వారా రూ.16,672.81 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టయింది. 47,974 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ పీరియడ్​లో మార్చిలోనే అత్యధికంగా రూ.11,072.47 కోట్ల మేర పెట్టుబడులు రావడం గమనార్హం. ఆ నెలలో 247 సంస్థలకు పర్మిషన్లు వచ్చాయి. ఇందులో పలు భారీ పరిశ్రమలున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక, అత్యధికంగా ఫిబ్రవరిలో 262 సంస్థలకు అనుమతులు ఇవ్వగా.. ఆ నెలలో రూ.1,331.83 కోట్లు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. డిసెంబర్​లో 179 కంపెనీలకు అనుమతివ్వగా.. రూ.244.58 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో 193 కంపెనీలకు అనుమతిస్తే రూ.897.11 కోట్లు, ఏప్రిల్​లో 193 కంపెనీలకు అనుమతిస్తే రూ.447.40 కోట్లు, మేలో 216 కంపెనీలకు అనుమతులివ్వగా రూ.960.41 కోట్లు, జూన్​లో 195 కంపెనీలకు అనుమతులిస్తే.. రూ.973.09 కోట్లు, జులైలో 201 కంపెనీలకు అనుమతులివ్వగా రూ.607.83 కోట్లు, ఆగస్టులో ఇప్పటివరకు 78 కంపెనీలకు అనుమతులివ్వగా.. రూ.138.12 కోట్ల మేర పెట్టుబడుల రూపంలో వచ్చినట్టు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి.

దావోస్ టూర్​లోనే భారీగా..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు దావోస్ టూర్​కు వెళ్లారు. వారికది తొలి దావోస్ టూర్ కూడా కావడం విశేషం. ఆ తొలి దావోస్ టూర్​ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఆ టూర్​లో రూ.40,232 కోట్ల వరకు పెట్టుబడులను రాబట్టగలిగారు. ఇక, తాజాగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 19 సంస్థలతో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబులు భేటీ అయి పెట్టుబడులు సాధించడంలో సక్సెస్ అయ్యారు. రూ.31,532 కోట్ల పెట్టుబడులతో పాటు.. 30,750 మందికి ఉపాధి కల్పించేలా కృషి చేశారు. 

కేటీఆర్ టూర్​ల కన్నా ఎక్కువే

కేటీఆర్ ఐటీ, ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన దావోస్​ టూర్లలో మొత్తం కలిపినా రూ.24,500 కోట్ల పెట్టుబడులే రావడం గమనార్హం. 2020 టూర్​లో రూ.500 కోట్లు, 2022 టూర్​లో రూ.4,128 కోట్లు, 2023 పర్యటనలో రూ.19,900 కోట్ల విలువైన పెట్టుబడులనే ఆకర్షించగలిగారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన రెండు టూర్లలోనే రూ.71 వేల కోట్ల విలువైన పెట్టుబడులు రావడం విశేషం.