
ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ యోగా డే) దేశ, విదేశాల్లో 2022, జూన్ 21న ఘనంగా నిర్వహించారు. మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో 2022 ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
మైసూర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక సాంస్కృతిక రాజధాని మైసూర్ ప్యాలెస్ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక యోగా ప్రదర్శనలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేశారు. గార్డియన్ యోగా రింగ్ కార్యక్రమంలో ప్రపంచంలోని 79 దేశాలు పాల్గొనడం ఆరోగ్యం, సమానత్వం, సహకార స్ఫూర్తిని రగిలించాయన్నారు.
యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకోవడం వెనుక ఒక కారణం కూడా ఉన్నది. ఏడాదిలోనే అత్యంత ఎక్కువగా పగటికాలం ఉండే రోజుగా జూన్ 21కి పేరుంది. జూన్ 21న సుదీర్ఘమైన పగటిరోజు కావడంతో చాలా దేశాల్లో ఈ తేదీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.