- 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- త్వరలోనే కమిషన్కు చైర్మన్, ఇద్దరు సభ్యుల నియామకం
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణ కోసం 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, కమిషన్కు చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులను కేంద్రం త్వరలోనే నియమించనున్నది. అలాగే, శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
వేతన సంఘం సిఫార్సుల మేరకు కోటి మంది కేంద్ర ఉద్యోగులకు వేతనాలు, అలవెన్సులు పెన్షనర్లకు పెన్షన్ పెరుగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. కాగా, 2016 జనవరిలో అమల్లోకి తీసుకొచ్చిన 7వ వేతన సంఘం గడువు 2026తో ముగుస్తున్న నేపథ్యంలో.. సకాలంలో సిఫార్సులు అమలుచేసేలా ముందుగానే 8 వేతన సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 8వ పే కమిషన్కు సంబంధించిన అదనపు సమాచారం, మెంబర్షిప్ తదితర వివరాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు.
రూ.3,984 కోట్లతో మూడో లాంచ్‌ప్యాడ్
ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో రూ. 3,984.86 కోట్లతో మూడో లాంచ్‌ప్యాడ్ ఏర్పాటుకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టనున్న భవిష్యత్ ప్రయోగాలకు అత్యంత భారీ రాకెట్లను ప్రయోగించాల్సిన అవసరం ఉంది. వాటిని నింగిలోకి పంపడానికి శ్రీహరికోటలో ప్రస్తుతం ఉన్న 2 లాంచ్ ప్యాడ్లు సరిపోవు. అందుకే నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్(ఎన్‌జీఎల్‌వీ), లాంచ్ వెహికల్ మార్క్ –3 (ఎల్‌ఎంవీ3) లాంటి భారీ ప్రయోగాలు నిర్వహించేందుకు తగ్గట్టుగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ALSO READ | అదానీ గ్రూప్నకు చెమటలు పట్టించిన.. హిండెన్‌బర్గ్ కంపెనీని ఎందుకు మూసేశారంటే..