న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన వాటాదారులకు రూ. 8,000 కోట్ల ప్రత్యేక డివిడెండ్ చెల్లించాలని యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లింపును పరిశీలించి ఆమోదించడానికి హెచ్జెడ్ఎల్ బోర్డు మంగళవారం సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఇందులో దాదాపు 30 శాతం లేదా రూ. 2,400 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి రావొచ్చని ఈ సంగతి తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. 10,383 కోట్ల సాధారణ నిల్వలను.. లాభాలకు బదిలీ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగింది. ఈ ప్రత్యేక డివిడెండ్ దాదాపు రూ. 6,000 కోట్ల సాధారణ డివిడెండ్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
హెచ్జెడ్ఎల్లో దాదాపు 65 శాతం వాటాను కలిగి ఉన్న ప్రమోటర్ వేదాంత లిమిటెడ్ కూడా దాదాపు రూ. 5,100 కోట్లను అందుకుంటుంది. వేదాంత కూడా ఆగస్టు 16 నుంచి 19 వరకు ఆఫర్ ఫర్ సేల్ ఇష్యూ ద్వారా హెచ్జెడ్ఎల్లో 3.31 శాతం వాటాను విక్రయించనుంది. ఒక్కో షేరు ధరను రూ.486గా నిర్ణయించింది.