- మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం
భోపాల్: మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. పాతకాలపు ఇంటి గోడ కూలిపోవడంతో తొమ్మిది మంది పిల్లలు మరణించారు. మరికొంత మంది చిన్నారులకు తీవ్రమైన గాయాలయ్యాయి. సాగర్ జిల్లాలోని హర్దౌల్ బాబా టెంపుల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆలయంలో మతపరమైన వేడుకలో భాగంగా శివలింగాలను తయారు చేస్తుండగా పక్కనే ఉన్న ఇంటి గోడ కూలిపోయి చిన్నారులపై పడింది. ఈ ఇల్లు 50 ఏండ్ల నాటిదని భారీ వర్షాలతో కూలిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.
రెండ్రోజుల వ్యవధిలో రెండో ఘటన
రెండ్రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. రేవా జిల్లాలో శనివారం ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఓ ఇంటి గోడ కూలి నలుగురు మృతిచెందారు. కాగా, తాజా ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.