అచ్చంపేట, వెలుగు : దుప్పి(సాంబార్)ని వేటాడిన కేసులో 9 మంది వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు అచ్చంపేట ఎఫ్ఆర్వో అబ్దుల్ షుకూర్ తెలిపారు. అచ్చంపేట రేంజ్ పరిధిలోని చేదురుబావి తండాలో దుప్పి మాంసాన్ని దాచినట్లు అందిన సమాచారం మేరకు మూడవత్ రాజు ఇంటిపై దాడులు చేయగా, మాంసం దొరికినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. రాజుతో పాటు జానీని అదుపులోకి తీసుకొని విచారించగా, దుప్పిని వేటాడిన కేసులో మరో ఏడుగురు ఉన్నట్లు తేలింది.
బల్మూరు మండలం బిళ్లకల్ సమీపంలో లెంకల ఖాసీం మరి కొందరితో కలిసి కరెంట్ షాక్ పెట్టి దుప్పిని చంపి, మాంసాన్ని అచ్చంపేట మండలం చేదురుబావి తండాలో విక్రయించేందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అచ్చంపేట మండలం చేదురుబావి తండా, బ్రాహ్మణపల్లి, కొండనాగుల
బాణాల గ్రామాలకు చెందిన లెంకల ఖాసీం, రమేశ్, వలవి ఎల్లయ్య, మూడవత్ రాజు, గాజుల కోటయ్య, సైదులు, కొట్టే సైదులు, మహ్మద్ జానీ, ఓర్పు రాములును అరెస్ట్ చేసి కల్వకుర్తి కోర్టులో హాజరు పరచగా, నిందితులకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎఫ్ఆర్వో తెలిపారు.