ఆదిలాబాద్‌లో కిడ్నాప్.. బంధించి.. బట్టలిప్పి దాడి .. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్

ఆదిలాబాద్‌లో కిడ్నాప్.. బంధించి.. బట్టలిప్పి దాడి .. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
  • బాధిత యువకుడి ఫిర్యాదుతో కేసు నమోదు
  • ఆరుగురి అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు 
  • ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్​రెడ్డి వెల్లడి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​జిల్లా కేంద్రానికి చెందిన యువకుడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్​చేసి.. బంధించి.. బట్టలిప్పి దాడి చేసి.. ఆపై వీడియో తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం ఆదిలాబాద్​ డీఎస్పీ ఎల్.జీవన్​రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బంగారుగూడకు చెందిన సయ్యద్ జహీర్ ను గత జనవరి 8న అదే కాలనీకి చెందిన షేక్ ఇజాజ్ అలియాస్​ షేక్​రోషన్​ వినాయక్​చౌక్​లో ఆటోలో కిడ్నాప్ చేశారు. షేక్ సలీం అలియాస్​ కైంచి సలీం ఇంటికి తీసుకెళ్లి రూమ్ లో బంధించారు. అనంతరం జహీర్ బట్టలిప్పి 9 మంది దాడి చేసి కొట్టారు. ఆపై వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​చేశారు. 

పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు ఈనెల 26న రూరల్​స్టేషన్​లో కంప్లయింట్ చేశాడు. షేక్ ఇజాస్, షేక్ ముజీబ్, ఖానాపూర్​కు చెందిన హసీబుల్లా అలియాస్​ లతీఫ్, సయ్యద్ జుబేర్, మసూద్​నగర్​కు చెందిన షేక్ సోహెల్, మహాలక్ష్మివాడకు చెందిన అమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్​సలీమ్​అలియాస్​కైంచి సలీమ్, రాహెల్, సలీమ్ పరారీలో ఉన్నారు. ఇదివరకే షేక్​సలీమ్​అలియాస్​కైంచి సలీమ్​పై ఒక హత్య, అక్రమ ఆయుధాల కేసులు నమోదై ఉన్నాయి. నిందితుల నుంచి 3 ఆటోలు, మూడు సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. రూరల్​ సీఐ ఫణిధర్, ఎస్ఐ ముజాహిద్​ పాల్గొన్నారు.