స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ముంగేలిలోని సర్గావ్‌లో ఇనుము తయారీ కర్మాగారంలోని చిమ్నీ కూలిపోయిన ఘటనలో 9 మంది మరణించగా మరింతమంది గాయపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సహాయక చర్యల సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన సమయంలో శిథిలాల క్రింద చిక్కుకున్న క్షతగాత్రులని రక్షించి చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై ముంగేలి కలెక్టర్ రాహుల్ డియో మీడియాతో మాట్లాడుతూ ఇనుము తయారీ కర్మాగారంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. అలాగే భాదితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించి త్వరగా కోలుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. సహాయక చర్యల నిమిత్తం మరింతమంది ప్రభుత్వ అధికారులతోపాటు స్థానికుల నుంచి సహాయం కోరుతున్నట్లు వెల్లడించాడు.

ALSO READ | మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు

ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులోభాగంగా "ముంగేలి జిల్లాలో ఉక్కు కర్మాగారంలో చిమ్నీ కుప్పకూలిన ఘటనలో కార్మికులు మరణించారని విచారకరమైన వార్త అందింది. మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని మరియు వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శిథిలాల కింద కూరుకుపోయిన కార్మికుల భద్రత మరియు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని"  అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.