పొలంలో ఎరువులు చల్లుతున్న 9 మందికి అస్వస్థత

పొలంలో ఎరువులు చల్లుతున్న 9 మందికి అస్వస్థత

కల్లూరు, వెలుగు : పొలంలో ఎరువులు చల్లుతున్న తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామానికి చెందిన ఖమ్మం పాటి పాపారావు , కర్ల కంటి శ్రీను, కొమ్మనబోయిన భద్రయ్య, కిన్నెర కృష్ణ , తేళ్ల పుట్టలక్ష్మణ్ ,పెద్ద బోయిన పవన్, గడ కొట్టి భద్రాజి , పమ్మి వేణుగోపాలకృష్ణ, కొలికెపోగు గోపాలకృష్ణ ఆదివారం కూలీలుగా అన్నారుగూడెంలోని రైతు దొడ్డ సత్యనారాయణ వరి పంట పొలంలో రసాయనిక ఎరువులు, గుళికలు కలిపి చల్లుతున్నారు. 

వారందరికీ ఎరువులు చల్లుతున్నప్పుడే తలనొప్పి, కడుపునొప్పి వచ్చి వాంతులు చేసుకున్నారు. వెంటనే వారందరినీ ఆటోలో నూతనకల్లులోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి, అక్కడి నుంచి 108 అంబులెన్స్​లో కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ బాధితులతో ఫోన్​లో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. పలువురు కాంగ్రెస్​ లీడర్లకు కూడా బాధితులను పరామర్శించారు.