సూర్యాపేట/యాదగిరిగుట్ట, వెలుగు: సూర్యాపేట పట్టణంలోని పలు హాస్పిటల్స్‌ను శుక్రవారం ఆఫీసర్లు తనిఖీ చేశారు. డాక్టర్ లేకుండా కాంపౌండర్‌తోనే ట్రీట్‌మెంట్ చేయిస్తున్న సూర్య తేజ, తెలంగాణ హాస్పిటల్, ఎస్‌ఎం డెంటల్ హాస్పిటల్‌తో పాటు రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న ఎస్‌కే సలీం, స్వాతి, సత్యనారాయణ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ప్రణవి, విఘ్నేశ్వర క్లినిక్‌లను సీజ్ చేశారు. సూర్య, లాస్య ల్యాబ్స్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సరైన పర్మిషన్ లేకుండా హాస్పిటల్స్ నడిపించడం నేరమన్నారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్ధన్, ఆఫీసర్లు కళ్యాణ్ చక్రవర్తి, జయా శ్యాంసుందర్ ఉన్నారు. అలాగే యాదగిరిగుట్టలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న తులసీ హాస్పిటల్‌ను డీఎంహెచ్‌వో మల్లికార్జునరావు సీజ్ చేశారు.
యాదాద్రిలో ముందస్తు అరెస్ట్‌లు
యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్ట్‌లు కొనసాగాయి. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలని, పేస్కేల్ విడుదల చేయాలని, గుట్టపైకి ఆటోలను అనుమతించాలని ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ట్రిపుల్ ఆర్ కారణంగా ఒక్క రాయగిరిలోనే 70 మంది రైతులు 266 ఎకరాలు కోల్పోవాల్సి వస్తుండడంతో అలైన్‌మెంట్ మార్చాలని ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం యాదగిరిగుట్టకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు తమ నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రాయగిరిలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్ భువనగిరి సమీపంలోకి వచ్చారని తెలుసుకున్న బాధితులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ రోడ్డు మీదకు వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకొని, అరెస్ట్ చేసి బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్లిన తర్వాత వారిని విడిచిపెట్టారు. అలాగే యాదగిరిగుట్టలో వీఆర్‌ఏలు, ఆటోడ్రైవర్లను సైతం అరెస్ట్ చేశారు. గుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన కారణంగా పోలీసులు ఎక్కడి వాహనాలను అక్కడే ఆపేశారు. కేసీఆర్ పర్యటన ముగిసే వరకు కొండపైకి భక్తులను అనుమతించకపోగా, రోడ్లపై షాపులను మూసి వేయించారు. దీంతో సుమారు మూడు గంటల పాటు గుట్ట రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
అరెస్ట్‌లు అప్రజాస్వామికం
సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రజలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ కారణంగా రైతులు వందల ఎకరాల భూములు కోల్పోతున్నారన్నారు. రెండు నెలలుగా వీఆర్‌ఏలు, గుట్టలో
ఆరు నెలలుగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని అడిగిన వారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలి
కోదాడ, వెలుగు : ఎల్‌ఐసీ ఏజెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. కోదాడ ఎల్‌ఐసీ ఆఫీస్ ఎదుట ఏజెంట్లు చేస్తున్న ధర్నాకు శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. రూల్స్ పేరుతో ఏజెంట్ల ఉపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఎల్ఐసీ ఏజెంట్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, వట్టికుటి మల్లేశ్, బీవీఎల్ కాంతారావు, నంద్యాల రాంరెడ్డి పాల్గొన్నారు. అనంతరం పలు గ్రామాల్లో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
మూసీకి భారీ వరద
సూర్యాపేట, వెలుగు : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్ట్‌కు భారీ వరద వస్తోంది. 14 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో 8 గేట్లను ఎత్తి 21,836 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643 అడుగుల నీరు ఉంది.
అవినీతిపై చర్చకు సిద్ధం
హుజూర్‌నగర్, వెలుగు: అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. చర్చా వేదిక, తేదీ, టైంను ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డే నిర్ణయించాలన్నారు. ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో అవినీతి జరిగిందని, కానీ దానిని తనపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేఅవుట్లకు ఫెన్సింగ్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌కు మన్సిపాలిటీ నుంచి అనుమతులు లేవన్నారు.
మున్సిపాలిటీలో అవినీతిపై పోరాడుతాం
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో జరుగుతున్న అవినీతిపై పోరాడతామని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కబ్జా అయిన లేఅవుట్ స్థలాలను రక్షించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు శుక్రవారం చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఆఫీసులో లేఅవుట్ స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ మాయం చేసి స్థలాలను అమ్ముకున్నారని ఆరోపించారు.
మున్సిపల్ పరిధిలో కబ్జా అయిన లే అవుట్ స్థలాలను రక్షించడానికి జిల్లా అధికారులు సహకరించడం లేదన్నారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండానే కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి పనులు చేపడుతున్నారని, ఆ నిధుల్లో 2 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిపై లీగల్ గా పోరాడుతామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కౌంట్ డౌన్ మొదలైందని, అరాచకాలు, దాదాగిరి చేసే వారిని వదిలేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, పోలీసులు అరాచకాలు ఆపకుంటే స్టేషన్ ఎదుట ధర్నా చేసి జైల్ భరో కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో సూర్యాపేట కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, యరగాని నాగన్న గౌడ్, సాముల శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగాలతో సొంత విమానాలా?
చండూరు/మర్రిగూడ, వెలుగు: ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బుతో సీఎం కేసీఆర్ ఇపుడు సొంత విమానాన్ని వంద కోట్లు పెట్టి కొంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా శుక్రవారం 127వ రోజు మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం అంతంపేట, నామాపురం, కొట్టాల, ఇందుర్తి, శివన్నగూడెం, ఖుదాభక్ష్‌పల్లి, వెంకేపల్లి, చర్లగూడెం, రామ్ రెడ్డి పల్లిలో పర్యటించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన 1300 మంది అమరుల త్యాగాలను కేసీఆర్మరిచిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఒక్క కేసీఆర్కుటుంబమే బాగు పడిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు బహుజనులకు న్యాయం చేయలేవన్నారు. చర్లగూడెం ప్రాజెక్టులో కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు ఇచ్చారని, బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఓట్ల సమయంలో కేవలం రూ. 3 వేలు పంచి మోసం చేస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో కోటి విలువ చేసే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నిర్మించి, ఇప్పటివరకు అందులో అడుగు పెట్టకపోవడంతో అది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు.
ప్రజాధనాన్ని అనవసర కట్టడాలతో వృథా చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలు వారి ఇళ్లకు పిలిచి నిర్వహించాలన్నారు. నియోజకవర్గ ప్రజలను అడగకుండా రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడని ప్రశ్నించారు. కేసీఆర్ తన ఫాంహౌజ్‌కు వెళ్లడానికి 80 ఫీట్ల రోడ్డు వేసుకొని, మునుగోడు నియోజకవర్గ గ్రామాలకు మాత్రం ఎందుకు వేయలేదని నిలదీశారు. ఒకప్పుడు కేసీఆర్ కు 50 ఎకరాల భూమి ఉంటే, ఇపుడు 300 ఎకరాలకు ఎలా పెరిగిందన్నారు.
మునుగోడు ప్రజల భూములను ప్రాజెక్టుల పేరుతో గుంజుకున్నారని, కనీసం వారికి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో బీఎస్పీ జెండా గద్దెలు నిర్మిస్తుంటే బెదిరిస్తున్నారని అన్నారు. బీఎస్పీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలే ఇలా చేస్తున్నారని, అయినా ఎవరికీ భయపడేది లేదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 70 నుంచి 80 సీట్లు బీసీలకే కేటాయిస్తామని చెప్పారు. గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి యువకులు, మహిళలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్ర నిర్మల, జిల్లా అధ్యక్షులు పూదరి సైదులు పాల్గొన్నారు.
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజీనామా
యాదగిరిగుట్ట, వెలుగు : కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు. బీజేపీ పెద్దల సహకారంతో వేల కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్న రాజగోపాల్‌రెడ్డి, మునుగోడులో ఎలాగైనా గెలవాలని డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంచుతున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్‌కే మద్దతు తెలుపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా పెద్దల కోసమే పనిచేస్తోందన్నారు.
బీజేపీలో చేరిన జోగిగూడెం లీడర్లు
చండూరు, వెలుగు: నల్గొండ జిల్లా చండూరు మండలం జోగిగూడెం గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరారు. శుక్రవారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, నాయకులు కోడి గిరిబాబు, శ్రీనివాస్, పల్లె వెంకన్న పాల్గొన్నారు.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీతోనే సాధ్యం
చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ స్టేట్ లీడర్ జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తన రాజీనామా ద్వారానైనా తెలంగాణలో మార్పు రావాలనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. మునుగోడు అభివృ-ద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో జిల్లా మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాపాలన గాలికి వదిలేసి, ఆస్తులు కూడబెట్టుకునేందుకే మంత్రులు ప్రయారిటీ ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులంతా బీజేపీ వైపే ప్రచారం చేస్తారని, అసలు ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైందన్నారు. ఉద్యమ టైంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా కేసీఆర్‌కు ఆర్థికసాయం చేశారని గుర్తు చేశారు. నిరుద్యోగులు, యువకులు బీజేపీ వైపే ఉన్నారన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఇన్‌చార్జి కూన శ్రీశైలం, కె.రాములు, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, దూడల భిక్షం పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట అభివృద్ధిలో భాగంగా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిజంగా గుట్టను అభివృద్ధి చేసుంటే ప్రజలే హారతులు పట్టి స్వాగతం పలికేవారన్నారు. సీఎం వస్తుండడంతో ప్రజలను గృహ నిర్బంధం చేశారంటేనే పరిస్థితి ఏంటో అర్థం అవుతుందన్నారు. గుట్టను అభివృద్ధి చేస్తే తమ బతుకులు మారుతాయన్న ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, కొండపైకి ఆటోలను అనుమతించాలని డిమాండ్ చేశారు.
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దేవరకొండ (నేరేడుగొమ్ము), వెలుగు: మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలోని వైజాగ్ కాలనీ వద్ద సాగర్ బ్యాక్ వాటర్‌లో శుక్రవారం చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. మన ఊరు మన బడి కింద వైజాగ్ కాలనీలో రూ.40.11 లక్షలతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం కాసరాజ్‌పల్లిలో సీసీ కెమెరాలను ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మ హన్మానాయక్, జడ్పీటీసీ కేతావత్ బాలునాయక్, పీఏసీఎస్ చైర్మన్ ముక్కమళ్ల బాలయ్య, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, సిరందాసు కృష్ణయ్య, సర్పంత్ వాంకునావత్ నాగునాయక్ పాల్గొన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించాలి
చండూరు (మర్రిగూడ), వెలుగు : తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే చర్లగూడెం రిజర్వాయర్ పనులు ప్రారంభించాలని కుదాభక్షపల్లి, రాంరెడ్డిపల్లి, శివన్నగూడ నిర్వాసితులు డిమాండ్ చేశారు. మునుగోడులో దీక్ష చేసేందుకు వెళ్తున్న నిర్వాసితులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మర్రిగూడ తహసీల్దార్ ఆఫీస్ నుంచి మెయిన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిస్తే ఆయన తమ పట్ల అనుచితంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా నిర్వాసితులకు ర్యాలీకి కాంగ్రెస్ లీడర్లు చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతి మద్దతు తెలిపి మాట్లాడారు. నిర్వాసితుల నుంచి తీసుకున్న భూమికి ఐదు రెట్లు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వృద్ధులు హెల్ప్‌లైన్ సేవలు వినియోగించుకోవాలి
సూర్యాపేట, వెలుగు : వయోవృద్ధులను గౌరవించడంతో పాటు, వారి పోషణ, సంరక్షణ కూడా చూసుకోవాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూచించారు. వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ పార్క్ నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులు 14567 హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి పద్మ, డీసీపీవో రవికుమార్ పాల్గొన్నారు.
వయోవృద్ధులకు జిల్లాస్థాయి ఆటల పోటీలు
యాదాద్రి, వెలుగు : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా భువనగిరిలో వృద్ధులకు వాకింగ్, క్యారమ్‌బోర్డు, చెస్, మ్యూజికల్ చైర్, స్పూన్ గేమ్స్‌లో ఆటల పోటీలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కేవీ కృష్ణవేణి, అసోసియేషన్ అధ్యక్షుడు శెట్టి బాలయ్య పాల్గొన్నారు.
షేర్‌హోల్డర్లకు 15 శాతం డివిడెంట్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట పట్టణంలోని సుధా బ్యాంక్ 2021 – 22 వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం స్థానికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, ఎండీ పెద్దరెడ్డి గణేశ్ మాట్లాడారు. కరోనా టైంలో ఎన్నో ఆర్థిక సంస్థలు ఇబ్బందులు పడినప్పటికీ సుధా బ్యాంక్ మాత్రం లాభాల బాటలోనే నడిచిందన్నారు. బ్యాంక్ స్థాపించిన 15 సంవత్సరాల్లో 0 ఎన్‌పీఏ నమోదు కావడం గొప్ప విషయం అన్నారు. ఈ సంవత్సరం బ్యాంక్‌కు రూ. 1.30 కోట్ల లాభం వచ్చిందని, దీంతో షేర్ హోల్డర్లకు గత సంవత్సరంతో పాటు ఈ ఏడాది కూడా 15 శాతం చొప్పున డివిడెంట్ పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం ఏజెండాలోని అంశాలను ఆమోదించారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్, డైరెక్టర్లు అనంతల ప్రభాకర్, కమలేకర్ శంకర్‌లాల్, ఏపూరి శ్రవణ్‌కుమార్, డాక్టర్ మీలా సందీప్, కక్కిరేణి చంద్రశేఖర్, భూక్య సుజాత, మేనేజర్లు రవీందర్‌రెడ్డి, సైదులు, రామకృష్ణ పాల్గొన్నారు.
పట్టాదారు పాస్ బుక్స్ ఇవ్వాలి
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాజుగట్టులో స్టీల్ కంపెనీ కోసం కొన్న భూములకు పట్టాదాస్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని జీఎం అనిల్‌కుమార్ కోరారు. శుక్రవారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ రాజుగట్టులో వైజేకేఆర్ పవర్ గ్రీన్ కంపెనీ ఏర్పాటుకు సర్వే నంబర్ 826 నుంచి 83 వరకు 120.32 ఎకరాల భూమిని 2006లోనే కొని రిజిస్ట్రేషన్ చేయించినట్లు చెప్పారు. అప్పుడే కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ స్టీల్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా, తర్వాత కరోనా వల్ల ఫ్యాక్టరీ ఏర్పాటును వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ భూములకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పట్టంచుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి తమ భూములకు హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు, పాస్ పుస్తకాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓటమి భయంతోనే కేసీఆర్ దేశ పర్యటన
యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్ దేశ పర్యటన చేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాని కేసీఆర్ దేశానికి ఏం చేస్తాడన్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్, చిన్నలక్ష్మాపూర్, జేగ్యాతండా, వాసాలమర్రికి చెందిన పలువురు శుక్రవారం భిక్షమయ్యగౌడ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణగౌడ్, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్, నాయకులు యాట పెంటయ్య పాల్గొన్నారు.
ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నరు
చౌటుప్పల్, వెలుగు : ప్రజలంతా టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం కూసుకుంట్ల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, నాయకులు మిర్యాల పారిజాత పాల్గొన్నారు.